BJLP Deputy Floor Leader: బీజేఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎమ్మేల్యే పాయల్ శంకర్…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

బీజేఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎమ్మేల్యే పాయల్ శంకర్…

+ నియామక పత్రం జారీచేసిన కిషన్ రెడ్డి

+ హర్షం వ్యక్తం చేస్తున్న ఆదిలాబాద్ బిజెపి శ్రేణులు

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియామకమయ్యారు. బుధవారం ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాన్ని జారీ చేశారు. అయితే, బిసి సామాజిక వర్గానికి చెందిన పాయల్ శంకర్ ను ఫ్లోర్ లీడర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు ఆయన అభిమానులు సైతం ఫ్లోర్ లీడర్ ఖాయమంటూ ధీమాగా కనిపించారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి ఉండడంతో ఫ్లోర్ లీడర్ పదవి బీసీ సామాజిక వర్గానికి ఖాయమనీ అంతా అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి నాయకత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి పదవినే బీసీ సామాజిక వర్గానికి ఇస్తామని ప్రకటించిన నాయకత్వం, ఫ్లోర్ లీడర్ గా తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే నియమించే అవకాశమున్నట్లు అంతా భావించారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ పార్టీ అధినాయకత్వం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నీ ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ ప్రకటన జారీ చేయడంతో పాయల్ శంకర్ అభిమానులు, ఆదిలాబాద్ బిజెపి శ్రేణులు కొంత నిరాశకు గురయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి.. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి.. రెండూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే కేటాయించడంతో, బిజెపి అధినాయకత్వం సామాజిక న్యాయం పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పాయల్ శంకర్ ను ఫ్లోర్ లీడర్ గా నియమించినప్పటికీ కూడా, బీజేఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న పాయల్ శంకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత, నేరుగా బీజేఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమితులవ్వడం పట్ల పలువురు అభిమానులు, పార్టీ శ్రేణులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *