సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక ఎవరు ఉన్నారు. రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ.. ప్రియాంక… డీకే శివకుమార్ ఇలా లిస్ట్ పెద్దదే. కానీ వీరంతా కాంగ్రెస్ నేతలు కాబట్టి కాంగ్రెస్ కోసం పని చేస్తారు. కానీ అసలు కాంగ్రెస్ విజయం వెనుక ఉన్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే. నేరగా కాకపోయినా వారి వ్యూహాత్మక తప్పిదాలే.. కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డాయి. ఆరు నెలల కిందటి వరకూ తెలంగాణలో రాజకీయం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉండేది. కాంగ్రెస్ రేసులో ఉందో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోయేవారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు బీజేపీ దూకుడుగా ఉంది. కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయింది. బండి సంజయ్ దూకుడుపై విమర్శలు వస్తే వచ్చి ఉండవచ్చు కానీ బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే ఆయనే కరెక్ట్ అన్న అభిప్రాయానికి వచ్చారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. కవితఅరెస్టు ఖాయమనుకున్నారు. బండి సంజయ్ అంతకు ముందు నుంచీ అరెస్టుల గురించి చెబుతున్నారు. అరెస్టు జరిగి ఉంటే.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నది పూర్తి స్థాయిలో సాక్షాత్కరించేది. కానీ ఒక్క సారిగా బీజేపీ హైకమాండ్ బ్యాక్ ఫుట్ తీసుకుంది. బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించింది. కవిత కూడా అరె్స్టు కాలేదు. అదే సమయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించడం మానుకున్నారు. ఈ పరిణామం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలు గట్టిగా నమ్మడం ప్రారంభించారు. అందుకే బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారు కూడా బీజేపీలో చేరలేదు.ప్రధాని మోదీ నిజామాబాద్ లో చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీతో పాటు ఇటు బీఆర్ఎస్ కూ మైనస్ గా మారాయి. రెండు పార్టీలు ఒకటేనన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది.