సిరా న్యూస్,బోథ్
ఏజెన్సీలో జోరు వడ్డీ దందా
* డ్వాక్రా గ్రూపులకు పోటీగా రుణాలు...మోసపోతున్న మహిళలు
బోథ్ నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలలో వడ్డీ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అమాయక మహిళలను టార్గెట్గా చేసి వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మండలంలోని సోనాల గ్రామానికి చెందిన ఇరువురు మహిళలను ఇచ్చోడ మండల కేంద్రంగా కొనసాగుతున్న ఓ మైక్రో ఫైనాన్స్ వారు 40 వేల రూపాయలు రుణం ఇచ్చినట్లు వారి వేలిముద్రలు తీసుకొని సంబంధిత మేనేజర్ అకౌంట్ లోకి డబ్బులను మార్చుకున్నారు. అయితే రుణం మంజూరు అయిన ఇంకా మంజూరి కాలేదంటూ మహిళలను కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు .తీరా ఇన్స్టాల్మెంట్లు కట్టాలంటూ సంబంధిత మహిళల ఫోన్లకు మెసేజ్లు రావడంతో దొంగతనం బయటపడింది. దీంతో మహిళలు జరిగిన మోసాన్ని సంబంధిత ఫైనాన్స్ పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో విషయం బయటకు చెప్పవద్దని మీ డబ్బులు మీకు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించే ప్రయత్నం చేశారు. మహిళలు వీరి మాట వినకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో గత రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అయితే తమ ఉపాధి హామీ డబ్బులు సైతం కాజేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. కాగా ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ లను నిషేధించిన ఇచ్చోడ మండల కేంద్రంలో ఐదు మైక్రో ఫైనాన్స్ లు ఏర్పాటు కాగా దినసరి ఫైనాన్స్ లు ప్రతిరోజు లక్షల్లో టర్నోవర్ జరుగుతున్నాయి. స్థానిక పోలీసులు వడ్డీ వ్యాపారం పై ఉక్కు పాదం మోపిన ఏజెన్సీలో వడ్డీ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ఏది ఏమైనా అడ్డగోలుగా వెలిసిన మైక్రో ఫైనాన్స్ లు ఆర్బిఐ నిబంధన వ్యతిరేకంగా కొనసాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.