సిరాన్యూస్, బోథ్
సమస్యల వలయంలో గిరిజన బాలుర వసతి గృహం
* పని చేయని శుద్ధ జలం యంత్రం
* కంపుకొడుతున్న మరుగుదొడ్లు
* పట్టించుకోని అధికారులు….ఇబ్బందులు విద్యార్థులు
ప్రభుత్వ హాస్టళ్లు అంటే సాధారణంగా సమస్యలకు నెలవుగానే పేర్కొంటారు అంతా. దానికి తగ్గట్లే వసతి గృహంలో ఇబ్బందులు తాండవిస్తున్నాయి.సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుందామని వచ్చిన విద్యార్థులు ఇక్కడి వసతులు చూసి భయపడుతున్నారు. కొందరు దిక్కుతోచని స్థితిలో ఆ సమస్యల మధ్యే విద్యను నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ గిరిజన బాలుర వసతి గృహంలో కనీస సౌకర్యాల్లేక నరకయాతన అనుభవిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మూడు సంవత్సరాల నుండి పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు సరఫరా కాకపోగా తమ ఇంటి నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు స్నానాలు చేసేందుకు స్నానపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరు బయట స్నానం చేస్తున్నారు. ఇక మరుగుదొడ్లు ఉన్న వాటి నిర్వహణ లేకపోవడంతో మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాక స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న దృక్పథ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శుద్ధ జలం పథకం తాలూకు ఇంజన్లు మిషనరీ పని చేయకపోవడంతో శుభ్రమైన నీరు విద్యార్థులకు అందడం లేదు. ఈ విషయమై సంబంధిత హాస్టల్ వార్డెన్ ను వివరణ కోరగా ప్రతినెల శుద్ధ జలం చెడిపోయినా విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నామని తెలిపారు. మరుగుదొడ్లు స్నానపు గదుల విషయమై అధికారులకు తెలపగా త్వరలోనే మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఏది ఏమైనా బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తీరక విద్యార్థులు సతమతమవుతున్నారు.