సిరా న్యూస్,గుంటూరు;
ఎంత కరుడు కట్టిన నేరస్తుడైనా ఎక్కడో చిన్న తప్పు చేస్తారనే పోలీసు నీతిని పాటించారో ఏమో.. ముగ్గురు ఐపీఎస్‌లు కూడా వెనకాముందు ఆలోచించకుండా… ఆవేశపడి అడ్డంగా బుక్కైపోయారా? అనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కేసులో పోలీసులకు చిక్కిన ఆధారాలు ముగ్గురు ఐపీఎస్ అధికారులు తప్పు చేశారనే బలమైన సాక్ష్యాలుగా చెబుతున్నారు. దీంతో ఆ ముగ్గురిపై చర్యలకు డీజీపీ నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆగమేఘాలపై సస్పెన్షన్ వేటు వేసింది.నిజానికి ఏపీలో కొందరు ఐపీఎస్‌లపై వేటు చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్‌గా ప్రచారం ఉంది. కానీ, ఏ తప్పు చేయకుండా ఎవరిపై చర్యలు తీసుకుంటారు…? అందుకే అధికారుల తప్పులపై ఆధారాలు లభించేవరకు వేచి చూస్తున్నారని అంటున్నారు. తగిన సాక్ష్యాధారాలు లభించగానే చర్యలు తీసుకుంటున్నట్లు ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ద్వారా స్పష్టమవుతోందని అంటున్నారుగత ప్రభుత్వంలో కొందరు అధికారులు తమ పరిధులు దాటి వ్యవహరించారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వేచి చూస్తోంది. ఇలా సుమారు 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు లేకుండా వెయిటింగ్‌లో పెట్టగా, వీరిలో 16 మంది రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి హాజరు వేయించుకోవాలని మెమో జారీ చేసింది. అంటే ఈ 16 మందిపై ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లేనని చెబుతున్నారు. ఐతే ఇప్పుడు ఆ 16 మందిలో ముగ్గురిపై తాజాగా వేటు పడింది. ముగ్గురు ఐపీఎస్‌లపై ముంబై నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదే ప్రభుత్వానికి ఆయుధంగా మారిందని చెబుతున్నారు.సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమకు ఫేవర్‌గా నడుచుకోవాలని ఉద్యోగులకు సూచిస్తుంది. కానీ, అధికారులు రూల్స్ ప్రకారమే నడుచుకుంటూ ప్రభుత్వాధినేతలు చెప్పే పనులను రిస్క్ లేకుండా చేస్తుంటారు. కాదంబరి జెత్వానీ కేసులో కూడా ఇదేవిధంగా ముందస్తుగా ప్రభుత్వ పెద్దలు సూచనల ప్రకారమే నడుచుకున్నారని అనుకున్నా… ఐపీఎస్‌లుగా తమ సుదీర్ఘ అనుభవాన్ని ఎలా విస్మరించారనే ప్రశ్న తలెత్తుతోంది.ఎఫ్ఐఆర్ కన్నా ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం, ముంబై విమానం ఎక్కేందుకు కేవలం అర గంట ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఐపీఎస్లు ఎక్కడా జాగ్రత్త పడలేదనే విషయాన్ని బయటపెడుతోంది. ఈ మిస్టేక్సే వారు అడ్డంగా దొరికిపోయేలా చేసిందంటున్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితులు తారుమారైతే తమ పరిస్థితి ఏమవుతుందనే కనీస ఆలోచన లేకుండా ఐపీఎస్‌లు వన్‌వే ట్రాఫిక్‌లో వెళ్లినట్లు… ఒకే కోణంలో ఆలోచించి ముందు వెళ్లడమే విస్తుగొలుపుతోందంటున్నారు.చంద్రబాబు ప్రభుత్వానికి వైసీపీ హయాంలోని గత ప్రభుత్వానికి ఈ కేసుతో ఒక స్పష్టమైన తేడా చెబుతున్నారు పరిశీలకులు. వైసీపీ ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై సమీక్షకు ప్రయత్నించారు. చంద్రబాబుతోసహా టీడీపీలోని కీలక నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కానీ, ఆయా కేసుల్లో అరెస్టైన నేతలు తప్పు చేసినట్లుగా ఆధారాలు చూపించలేకపోయారనే ప్రచారం ఉంది. చంద్రబాబు కేసులో తగిన ఆధారాలు సేకరించకుండానే అరెస్టు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇక అచ్చెన్నాయుడిని అరెస్టు చేశాక సాక్ష్యాలు లేవని ఏకంగా కోర్టుకి నివేదించినట్లు గుర్తు చేస్తున్నారు.కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతోందని అనిపిస్తోంది. అధికారులైనా, నేతలపైన అయినా కేసులు నమోదు చేసినా, సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకున్నా, వారు ఎక్కడా ప్రశ్నించలేని పరిస్థితిని తీసుకువస్తోంది. ఒక వేళ ఎవరైనా కోర్టుకు వెళ్లిన తగిన సాక్ష్యాధారాలు చూపిస్తే ప్రభుత్వ వాదనే నెగ్గేలా జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు. టీడీపీ కార్యాలయాలు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ నేతలు కోర్టులు, పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతుండగా, ఇసుక కుంభకోణంలో ఆ శాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.ఇక ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయగా, అరెస్టు భయంతో వెంకటరెడ్డి విదేశాలకు వెళ్లిపోయారంటున్నారు. ఇదేవిధంగా బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కూడా అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగించిన ప్రభుత్వం…. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతల పాత్రపై కూపీ లాగుతోంది. ఇలా కూటమి ప్రభుత్వం టార్గెట్‌తో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు దోషులవుతుంటే… సూత్రదారులైన వైసీపీ నేతలు కూడా త్వరలో అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో ఏపీ రాజకీయం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.