పీల్చి పిప్పి చేస్తున్న వడ్డీ వ్యాపారులు

రూ.100 కు 15 రూపాయిలు చేరిన వడ్డీ
సిరా న్యూస్,నిజామాబాద్;
వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ప్రైవేటు, వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కి పేద లతోపాటు సామాన్యులు, చిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. వడ్డీలు కట్టలేక విలవిల్లాడుతున్నారు. వ్యాపారుల వద్ద చేసిన అప్పులు సకాలంలో చెల్లించకున్నా, ప్రతినెలా చెల్లించాల్సిన వడ్డీ సమాయానికి చెల్లించకపోయినా అప్పు తీసుకున్న వారికే కాదు.. వారి కుటుంబ సభ్యులకు కూడా చుక్కలు చూపిస్తున్నారు.అప్పులు తీర్చకుండా ఇంట్లోని ఆడవాళ్ల బట్టలు విప్పదీసి నడిరోడ్డు మీద నిలబెడదామని పరుషంగా హెచ్చరిస్తున్నారు. కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలంటే ఎత్తుకెళ్లి పోతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అప్పులు తీసుకున్నాక వారికి సకాలంలో అప్పు తీర్చే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక నానా తంటాలు పడుతున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులకు తట్టుకోలేక, అప్పులు తీర్చే మార్గం లేక అవస్థలు పడుతున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల నుండి బయట పడే మార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారుమరి కొందరు వైట్ కాలర్ ప్రొఫెషన్ గా పన్నులు కడుతూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారు వారి బ్లాక్ మనీని కొందరు వ్యక్తలు ద్వారా వడ్డీ వ్యాపారంలో పెడుతున్నారు. వారి ద్వారా అవసరం ఉన్న వ్యాపారులు, సాధారణ వ్యక్తులకు అధిక వడ్డీలకు రుణాలిస్తున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను వ్యాపారంలో పెట్టి సక్సెస్ అయితే అప్పు చేసిన డబ్బులతో బాగా సంపాదించి చేసిన అప్పులు తీర్చే స్తున్నారు. కానీ, విధి ఎదురు తిరిగి వ్యాపారాల్లో నష్టపోతే అప్పులు తీర్చే మార్గం లేక, వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక, సమాజంలో తమకున్న పరువు బజారుపాలవుతుందనే ఆవేదనతో అర్ధంతరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారుపట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా వడ్డీ వ్యాపారులు రెచ్చి పోతున్నారు. ఫైనాన్స్ వ్యాపారులు నూటికి రూ. 5 నుంచి రూ. 15 ల వరకు వడ్డీతో అప్పులు ఇస్తున్నారు. మరి కొందరు బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని రూ. 20 ల వరకు వడ్డీ ఒప్పందంతో అప్పులిస్తున్నారు. అవసరానికి మరో మాట మాట్లాడకుండా అప్పులు తీసుకుంటున్నారు. ఇబ్బందుల్లో పడుతున్నారు. సాధారణంగా గ్రామాల్లో నూటికి రూ. 2 ల చొప్పున వడ్డీకి అప్పులిచ్చే వారు. కానీ, ఎప్పుడైతే రిజిష్టర్ ఫైనాన్స్ లు వడ్డీ వ్యాపారం లోకి వచ్చాయో అప్పటి నుంచి వడ్డీ వ్యాపారులకు ఇది ఓ వరంగా మారింది. ఈ మధ్యకాలంలో మనుషుల ఆలోచనల్లో వచ్చిన మార్పు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సైతం వడ్డీకి డబ్బులు బాకీ ఇచ్చేందుకు చాలామంది వెనకాడుతున్నారు. అవసరానికి అప్పులు చేసి సమయానికి అప్పు తీర్చే మార్గం లేక ఎగ్గొట్టే వారూ లేకపోలేదు.వడ్డీ వ్యాపారుల బాధితుల్లో హైదరాబాద్ కు చెందిన టాలీవుడ్ కు చెందిన ఒక నిర్మాత కూడా ఉన్నారు. వ్యాపారుల వేధింపులు భరించలేక ఆ నిర్మాత ఓ న్యూస్ ఛానల్ సీఈఓ తో కలిసి నిజామాబాద్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు ఈ విషయంలో బాధిత నిర్మాతకు న్యాయం చేయకపోగా, మధ్యే మార్గం తో వారితోనే ఒప్పందం చేసుకుని గడువు తీసుకుని అప్పు చెల్లించాల్సిందిగా సూచించారు. వడ్డీ వ్యాపారులను పోలీసులు సైతం ఏమీ చేయలేరనే వాస్తవం తెలిసి సదరు నిర్మాత ఆస్తులమ్మి అప్పులు తీర్చాడు.
ముగ్గురు ఆత్మహత్య…
వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగానే జక్రాన్ పల్లి మండలం అర్గుల్ కుంట రాజేష్ అలియాస్ ఇటుక బట్టి రాజేష్ (42) అనే యువరైతు అప్పులోళ్ళ వేధింపులు తట్టుకోలేక చెట్టుకురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో వ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టింది.కామారెడ్డిలో కూడా ఓ కుటుంబం వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైంది. తాజాగా ఓ కుటుంబం బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదృష్టవశాత్తు ఆ కుటుంబంలోని ఓ మహిళను స్థానికులు రక్షించినా, మిగతా సభ్యులు నీళ్లలో గల్లంతై మృతి చెందారు. చేసిన అప్పు తీర్చకపోతే ఆడవాళ్ల ఒంటి మీద బట్టలిప్పేస్తామని వడ్డీ వ్యాపారులు హెచ్చరించి, భయపెట్డడంతో ఆత్మాభిమానం దెబ్బ తిన్న ఆ కుటుంబం బతకడం చావడమే మేలనుకుంది. అందుకే ఆత్మహత్యే శరణ్యమని భావించి గోదావరి లో దూకేసింది. నిజామాబాద్ కు చెందిన ఓ పెట్రోల్ బంక్ వ్యాపారి కూడా కుటుంబంతో సహా విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలున్నాయి. వీరంతా వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన వారే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *