సిరాన్యూస్, ఇచ్చోడ
అక్రమ ఇటుక బట్టీలు
* నిబంధనలకు విరుద్దంగా వ్యాపారం
* పట్టించుకోని అధికారులు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారు. రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొసున్న ఇటుక బట్టీలు కార్మికుల బతుకులను చిధ్రం చేస్తుండడంతో పాటు జీరో వ్యాపారం జోరుగా జరుగుతోంది. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలు ఉల్లఘించినప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మండలంలో ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే ముందుగా గ్రామ పంచాయతీతో పాటు మైనింగ్, రెవెన్యూ, పరిశ్రమశాఖ, కార్మికశాఖ, విద్యుత్ శాఖ, రవాణ శాఖల నుండి అనుమతి తీసుకొని బట్టీలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇచ్చోడ మండలంలో అవి ఏవి కనిపించడంలేదు. పంట పొలాలలో ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికంగా ఉండే వనరులన్ని కొల్లగొడుతున్నారు. ఏళ్ళ తరబడి వ్యాపారాలు కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జనావాసాలకు 5కిలో మిటర్ల దూరంలో ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వ్యవసాయ భూమికి నాలా అనుమతి తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలి. వీటిలో ఏ ఒక్కటి అనుమతి లేకున్నా సదరు నిర్వాహకునిపై చర్యలు తీసుకొని బట్టీలను సీజ్ చేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఉన్నా ఒక్కరిపైన కూడా చర్యలు చేపట్టడం లేదు. గ్రామ స్థాయిలో బహిరంగంగా వ్యాపారాలు కొనసాగిస్తున్న అధికారులు తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిసర ప్రాంతాలలోని కుంటల్లో, చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలించి ఇటుకల తయారీకి ఉపయోగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు వెలిశాయి. చెరువు నుండి నల్ల మట్టిని డంపింగ్ చేసుకొని అధికారుల అండతో వ్యాపారులది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. పంట పోలాలను సైతం వదలకుండా ఇటుక వ్యాపారులు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు లాగా నడిపిస్తున్నారు. పంటలు సాగుచేస్తున్న రైతులను మభ్యపెట్టి వారి పోలాలలో ఇటుకలు తయారు చేస్తున్నారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ను తమ వ్యాపారానికి వాడుకుంటున్న విద్యుత్ అధికారులు స్పందించడంలేదు. గ్రామానికి 5కిలో మిటర్ల దూరంలో బట్టీలను ఏర్పాటు చేయాలనే నిబందనలు ఉన్న గ్రామానికి కూతవేటు దూరంలోనే ఇటుక బట్టీలను ఏర్పాటు చేశారు. ఇటుక బట్టీలు కాల్చిన సమయంలో వెలువడే పోగతో గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల ప్రాణాలతో చలగాటమాడే ఇటుక బట్టీలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చోరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.