తమ్ముళ్లు వర్సెస్ సైనికులు…

సిరా న్యూస్,ఒంగోలు;
ఏపీలోని ఆ జిల్లాలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిందనే చెప్పవచ్చు. ఛోటా మోటా నాయకుల మధ్య రాజకీయ వేడి రాజుకోగా.. అది చిన్నగా టీడీపీ వర్సెస్ జనసేనగా మారబోతున్న పరిస్థితి ప్రస్తుతం ఈ జిల్లాలో కనిపిస్తోంది. ఇంతకు ఈ జిల్లా రాజకీయ సెగ రాష్ట్ర రాజకీయాలను తాకనుందా.. లేకుంటే వేడి చల్లారేనా అనేదే తేలాల్సి ఉంది.ఏపీలోని ప్రకాశం జిల్లా రాజకీయం రూటే సపరేట్. అందుకే ఈ జిల్లాలోని రాజకీయ ప్రకంపనల తాకిడి రాష్ట్ర రాజకీయాలను తాకుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే టీడీపీ కూటమి గెలిచిన తరువాత.. ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ హవా పూర్తిగా తగ్గిందని చెప్పవచ్చు. ఓ వైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఒంగోలులో పట్టు సాధించే దిశగా.. అడుగులు వేస్తున్నారు. మరోవైపు వైసీపీ పెద్దన్నగా పేరుగాంచిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అనూహ్యంగా జనసేన వైపు మొగ్గు చూపారు. ఈ దశలోనే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ను ఇటీవల బాలినేని కలిశారు. ఇక్కడే ఒంగోలు పొలిటికల్ రౌండప్ ఒక్కసారిగా మారింది.బాలినేని జనసేనలో చేరేందుకు పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఒంగోలు టీడీపీ నేతలు ఒక్కసారిగా నిరసన గళమెత్తారు. . ఎమ్మెల్యే దామచర్ల సైతం.. బాలినేని అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని, అలాగే అవినీతికి పాల్పడ్డారని, జనసేనలో చేరినా తాము వదిలే ప్రసక్తే లేదంటూ స్పందించారు.ఇలా టీడీపీ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో బాలినేని సైతం తాను పవన్ కి ఫిర్యాదు చేస్తానని, తాను ఎప్పుడూ వేధింపులకు పాల్పడలేదంటూ ప్రకటించారు. ఈ సమయంలోనే ఒంగోలులో బాలినేని అనుచరులు జనసేన పార్టీ ప్లెక్సీలను ఏర్పాటు చేసి, అందులో బాలినేనికి స్వాగతం అంటూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల ఫోటోలను ఏర్పాటు చేశారు. అసలే బాలినేని – దామచర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఉండగా.. ఈ ప్లెక్సీలు అగ్నికి ఆజ్యం పోశాయని చెప్పవచ్చు.దీనితో ప్లెక్సీలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలుగు తమ్ముళ్ళు. అలాగే అపరచిత వ్యక్తులు బాలినేని ప్లెక్సీలను చించివేశారు. ఇక బాలినేని, ఆయన అనుచరులు సైతం తాము కూడా తగ్గేదేలేదంటూ.. ఇక రివర్స్ రాజకీయాలకు సిద్దమవుతున్నారట. ఇది ఇలా ఉంటే జనసేన పార్టీలో చేరుతున్న బాలినేనికి జిల్లా జనసేన నాయకులు సైతం మద్దతు పలికారు.ఇదే ఇప్పుడు టీడీపీ కూటమికి పెద్ద తలనొప్పిగా మారిందట. బాలినేనికి పవన్ కి మధ్య స్నేహబంధం జనసేన వైపు బాలినేనిని లాగితే.. టీడీపీ అధిష్టానం ఇంతకు ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఒంగోలు టీడీపీ నాయకులకు గప్ చుప్ అంటూ సూచిస్తుందా.. లేక బాలినేని చేరికకు టీడీపీ అడ్డు తగులుతుందా అనేది తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *