మార్ఫింగ్ ఫోటోలతో గులాబీ దళం

 సిరా న్యూస్,హైదరాబాద్;
మరో వారం పది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడం ఖాయం. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అన్నింటికన్నా ముందు ఉంది. కాంగ్రెస్‌ పొత్తులపై కసరత్తు చేస్తోంది. తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మాత్రం అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక దశాబ్దం కాలంగా ఎన్నికల్లో సోషల్‌ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. మోదీ ప్రధాని అయిన నాటి నుంచి సోషల్‌ మీడియా ప్రాధాన్యం బాగా పెరిగింది. అందుకే దేశంలో అన్ని పార్టీలకంటే బలంగా బీజేపీ సోషల్‌ మీడియా ఉంటుంది. మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా స్ట్రాంగ్‌గా ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో నేతలు డీలా పడ్డారు. అదే విధంగా సోషల్‌ మీడియా కూడా దారి తప్పుతోంది. మార్ఫింగ్‌ ఫొటోలతో టీడీపీ నేతలను టార్గెట్‌ చేయడం చూస్తుంటే.. అసలు ఏం జరుగుతోంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా తెలుగు దేశం పార్టీతో గొడవలు పెట్టుకోవడం ద్వారా టైంపాస్‌ చేస్తోంది.మొన్నటి వరకు విపక్షాలకు చుక్కలు చూపించిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇప్పుడు అధికార కాంగ్రెస్‌కు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో ఏది పోస్టు చేయాలో తెలియక బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా మార్ఫింగ్‌ పోస్టులు పెడుతూ అభాసుపాలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ విషయంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా అతిగా స్పందించింది. దీంతో ఆంధ్రా సెటిలర్స్‌ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితంగా కాంగ్రెస్‌ లాభపడింది.సోషల్‌ మీడియా ఇప్పుడు అన్ని పార్టీలకు కీలకంగా మారింది. కానీ, బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా పార్టీకి పనికొచ్చే విషయాలకన్నా, పనికిరాని అంశాలపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నట్లు కనిపిస్తోంది. మార్ఫింగ్‌లు వేసుకుంటూ టైంపాస్‌ చేస్తోంది. అధికార పార్టీతో కాకుండా పొరుగు రాష్ట్రం పార్టీలతో గొడవలు పడుతోంది. కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా బలహీనంగా ఉన్నా.. పోస్టు చేసే అంశాలతో బలంగా ముద్ర వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *