భూములు కోల్పోతున్న బాధితుల ఆందోళన
సిరా న్యూస్,కోరుట్ల;
పాత సర్వే ప్రకారం హైవే రోడ్డును నిర్మించండని నేషనల్ హైవే బైపాస్ రోడ్డులో భూములు కోల్పోతున్న బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ నుండి జగదల్పూర్ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న నేషనల్ హైవే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుచున్నవి. అందులో భాగంగా కోరుట్ల పట్టణంలో గత కొన్ని రోజుల నుండి నేషనల్ హైవే సర్వే అధికారులు రోడ్డు వెళ్లే ప్రాంతంలో సర్వే చేస్తున్నారు. కాగా తాజాగా గురువారం రోజున మళ్లీ సర్వే చేసేందుకు అధికారులు వచ్చారు. గతంలో చేసిన సర్వేలో వేరే భూముల నుండి నేషనల్ హైవే వెళుతుండదని, కానీ ప్రస్తుతం ఆ విధంగా కాకుండా తమ భూముల నుండి నేషనల్ హైవే వెళుతున్నట్లు సర్వే చేస్తున్నారని భూములు కోల్పోతున్న బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే సర్వేకు వచ్చిన అధికారులను తాము అడ్డుకున్నామని,విషయం తెలుసుకున్న ఆర్డీవో సంఘటన స్థలానికి వచ్చి తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు . ఈ సందర్భంగా పసుల కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తమ తాతలు సంపాదించిన ఆస్తి అని , భూములు కోల్పోతే దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం గతంలో చేసిన సర్వే విధంగా హైవే బైపాస్ రోడ్డును నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ భూముల నుండి కాకుండా పాత సర్వే ప్రకారం నేషనల్ హైవే బైపాస్ నిర్మాణం చేయాలని, లేదంటే తమ భూములకు నష్టపరిహారం ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు తెలపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.లేనిపక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని ,రాష్ట్ర ముఖ్యమంత్రి నీ కలుస్తామన్నారు. గేలే శ్రీనివాస్, అల్లే నరేందర్, పసుల రాంగోపాల్, చంటి చంద్రబాబు, పసుల హరీష్, చంటి శ్రీనివాస్, ఆ ప్రాంత రైతులు తదితరులు ఉన్నారు.