సిరాన్యూస్,ఇచ్చోడ
నాసిరకంగా బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు
* కొరవడిన అధికారుల పర్యవేక్షణ
* ఇబ్బందుల్లో ప్రయాణికులు
ఇచ్చోడ మండల కేంద్రంలోని ఆదిలాబాద్ బైపాస్ నుండి నిర్మల్ బైపాస్ వరకు రూ. 13 కోట్ల నిధులతో చేపడుతున్న రోడ్డు, సెంట్రల్ లైటింగ్ విస్తరణ పనులు నాసిరకంగా చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా మారింది. ప్రతి పనిలోనూ నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం ఆనవాయి తీగా మారింది. ఈ పనుల్లో సదరు గుత్తేదారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన రోడ్డు తూతూ మంత్రంగా కానిచేస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు చేసేది సదరు గుత్తేదారు బాగుపడటం కోసమా? ప్రజల కోసమా? అని స్థానికులు మండిపడుతున్నారు. అయినా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా సదరు గుత్తేదారు పాత బీటి రోడ్డును నాలుగు ఇంచులు తొలగించాల్సి ఉండగా పాత బీటి రోడ్డును రెండు ఇంచులు తొలగిస్తూ తూతూ మంత్రంగా దానిపైనే మొరం వేసి మామూలుగా రూలర్ తో రూలింగ్ చేస్తూ రోడ్డు విస్తరణ పనులను చేపడుతున్నారు. అయితే ఇలా రోడ్డు పనులు కొనసాగిస్తే తొందరలోనే బిటి పాడై రోడ్డు పగుళ్లు తేలి చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ పనులు నాణ్యతగా జరిగే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.