సిరా న్యూస్;
సరిగ్గా నెల రోజుల క్రితం… జులై 30 కేరళలో వయనాడ్‌లో ఆకాశం బద్దలైంది. కొండలు కూలిపోయాయి. ఊళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. 392 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఏ రోజుకారోజు కేరళ వరదలు సృష్టించిన విధ్వంసం తాలుకూ చేదు జ్ఞాపకాలు ఏదో ఒక రూపంలో స్థానికుల్ని వెంటాడుతునే ఉన్నాయి. నిలువ నీడ లేకుండా మిగిలిన పోయిన కుటుంబాల ఇప్పట్లో తేరుకునేలా కనిపించండ లేదు. యావత్ దేశం కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చింది.ఆగస్ట్ 2024 వర్షాలు స్టిల్ కంటిన్యూ… అయినా వర్షాకాలం వర్షాలు కాక.. ఎండలు కాస్తాయా అన్న వాళ్లు లేకపోలేదు. కానీ ఈ వర్షాలు వర్షాకాలం వర్షాల్లా కురిస్తే.. మనం ఇంత ఘనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. మహారాష్ట్రను ముంచేసింది. ముంబై మహానగరం కూడా వర్షాలకు అల్లాడిపోక తప్పలేదు. ఆ పై గుజరాత్‌ను గజగజలాడించాయి. ఇప్పటికే మూడు పదలుకుపైగా ప్రాణాలు పోయాయి. సుమారు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఈ ఏడాది నైరుతి ముందే వచ్చినా వర్షాలు ఆలస్యమయ్యాయి. జూలై 3-4 వారాల వరకు పెద్దగా వర్షాల జాడే లేదు. ఎగువన కర్నాటక, మహారాష్ట్రాలలో కురిసిన వర్షాల ధాటికి క్రమంగా ప్రాజెక్టులు నిండటం మొదలైంది. ఆపై తెలుగు రాష్ట్రాల్లోనూ వరణుడు కరుణించడంతో నాలుగైదు రోజుల క్రితం వరకు అన్ని ప్రాజెక్టులు కళకళలాడుతూ కనిపించాయి. ఆగస్టు కూడా ముగిసి సెప్టెంబర్ వస్తూ ఉండటంతో.. ఈ ఏడాదికిక వర్షాలు సరిపోతాయనుకున్నారంతా.. బట్…జూలై 30 కేరళను అతలాకుతలం చేసేస్తే… సరిగ్గా నెల రోజుల్లో అంటే ఆగస్టు 30-31 తెలుగు రాష్ట్రాలను ముంచేశాడు వరుణుడు. ఇప్పటికి ఎన్ని సార్లు వాయుగుండాలు రాలేదు.. అయినా.. ఈ వాయుగుండం సృష్టించినంత విలయం బహశా.. గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదేమో.. ఎక్కడో ఉత్తరాంధ్రలో కళింగపట్నం దగ్గర తీరం దాటిన వాయుగుండం కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఇంత బీభత్సం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. నిజానికి వాయుగుండం తీరం దాటిన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ప్రాంతంలో మాములూ వర్షమే పడింది. పెద్దగా ఈదురు గాలులు కూడా లేవు. దీంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతంత మాత్రం ప్రభావం ఉంటుందనుకున్న కృష్ణా-గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి వాయుగుండం తీరం దాటిన ప్రాంతంలోనే దాని ప్రభావం ఉంటే.. ఈ స్థాయిలో ఆస్తినష్టం సంభవించి ఉండేది కాదు. ఎందుకంటే తీరం దాటిన ప్రాంతంలో విజయవాడ నగరం.. దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండేంత జన సాంద్రత ఉండదు. ఇళ్లు, భవనాలు కూడా ఉండవు. పైగా ఆ ప్రాంతంలో ఉన్నవన్నీ గ్రామాలే. కానీ వాస్తవం వేరుగా ఉంది.విజయవాడ-గుంటూరు-ఖమ్మం-నల్గొండ.. ఈ ప్రాంతాల్లోనే కాదు.కానీ రెండు రాష్ట్రాల్లోని ఆ నాలుగు జిల్లాల్లో ఉన్న ప్రభావం తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో లేదు. అటు ఏపీలోని విజయవాడ-గుంటూరు, ఇటు తెలంగాణలో ఖమ్మం-నల్గొండ.. ఈ నాలుగు జిల్లాలు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాలు. అలాగే హైదరాబాద్ మహానగరాన్ని ఏపీతో కలిపే జిల్లాలు. దీంతో ఆ నాలుగు జిల్లాల్లో కురిసిన వర్షాలు, అక్కడ సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఖమ్మం, నల్గొండలో కురిసిన వర్షాల ధాటికి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారులు నీటి మునిగాయి. దీంతో రాకపోకలకు బ్రేక్ పడింది. కేవలం విజయవాడ-హైదరాబాద్ రోజుకి సుమారు 24వేల వాహనాలు తిరుగుతాయి. దీంతో గడిచిన 24 గంటలుగా అక్కడ రాకపోకలు స్తంభించడంతో రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రైల్వే లైన్లు కూడా దెబ్బతినడంతో విజయవాడ మీదుగా నడిచే 130 రైళ్లను రద్దు చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ల మధ్య కె సముద్రం వద్ద రైల్వైట్రాక్ దెబ్బతినడంతో చాలా రైళ్లపై ప్రభావం పడింది.ఏపీలో విజయవాడ పరిస్థితి అలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రానికొస్తే.. ఇక్కడ ఖమ్మం జిల్లాపై ఆ స్థాయిలో ప్రభావం పడిందని చెప్పొచ్చు. శనివారం రాత్రి ఖమ్మం నగరంలో కురిసిన వర్షం ధాటికి జనం అల్లాడిపోయారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దానికి తోడు మున్నేరు వాగు పొంగడంతో కట్టుబట్టలతో జనం మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్ టవర్లు పని చెయ్యలేదు. కొన్ని ప్రాంతాల్లో ఊరేదో.. చెరువేదో.. నది ఏదో కూడా తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. పాలేరు వరద ఉధృతికి కూసుమంచి దగ్గర హైవే ధ్వంసమైంది. మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నాయి. జనం కట్టుబట్టలతో మిగిలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రచాలం వద్ద గోదావరికి గతంలో సెప్టెంబర్ నెలలో కూడా వరదలు ముంచెత్తిన చరిత్ర ఉండటంతో స్థానికులు భయం భయంగా కాలం గడుపుతున్నారు.జులై-ఆగస్టు.. రెండు నెలలు కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీరని వ్యధను మిగిల్చాయి. మరి సెప్టెంబర్ సంగతేంటి..? ఈ నెలలో పరిస్థితి ఎలా ఉండబోతోంది..? గడిచిన 2 నెలలు చూసిన తర్వాత సహజంగానే అందరి దృష్టి ఈనెలపైనే ఉంది. గడిచిన ఐదేళ్లలో సెప్టెంబర్లోను తుపానులు బీభత్సం సృష్టించాయి. 2018లో ఒడిషాలో, 2021లో గుజరాత్, ఏపీ, ఒడిషా రాష్ట్రాల్లో వర్షాలు వణకుపుట్టించాయి. తాజా పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్లో ఏం జరుగుతుందా అన్న భయం నెలకొంది. అదే సమయంలో తాజాగా భారత వాతావరణ శాఖ దాదాపు అలాంటి వార్తనే అందించింది.దేశం మొత్తం మీద ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 16శాతం అదనంగా వర్షాలు పడ్డాయి. దాదాపు ఇదే పరిస్థితి ఈ నెలలో కూడా ఉండొచ్చన్నది ఐఎండీ అంచనా. చాలా చోట్ల రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతాలే నమోదవుతాయని వెల్లడించింది. అయితే ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ తాజా హెచ్చరిక. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో భారీగా వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కూడా వార్నింగ్స్ ఇచ్చింది.ప్రస్తుతానికి దేశంలో లా నినా ప్రభావం ఇంకా పూర్తిగా ముగియలేదన్నది ఐఎండీ చెబుతున్న మాట. సెప్టెంబర్ చివరినాటికి ముగిసే అవకాశం ఉందని, అయితే ఈ ప్రభావం వచ్చే సమ్మర్ మాన్ సూన్‌పై ఉండదని అప్పటికల్లా లా నినా ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈశాన్య భారతం, అలాగే దక్షిణాది రాష్ట్రాలలో సెప్టెంబర్-నవంబర్ నెలల మధ్యలో దాని ప్రభావం కనుమరుగువుతుందని అన్నారు. అయితే ప్రభావం తగ్గే సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది అప్పడే అంచనా వేసే పరిస్థితి ఉండదు. లానినా వల్ల మున్ముందు తుపాను ముప్పు ఉంటుందా.. ఉండదా అన్న అంచనాల విషయంలో ఇంకా వాతావరణ శాఖ ఒక కొలిక్కి రాలేదు.