సిరాన్యూస్, చర్ల:
ఏజెన్సీ అడ్డాగా మెడి”కిల్ “దందా
* ఇటు మెడికల్ షాపులు అటు ఆర్ఎంపీలు
* అంతా ఇష్ట రాజ్యం
* ఆర్థికంగా గుల్లవుతూ ప్రాణాలు.. ? సైతం హరి
* నిబంధనలకు పాతర
* కానరాని అధికారుల పర్యవేక్షణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏజెన్సీ ప్రాంతంలోని మెడికల్ షాపుల దందా , పరిధి దాటి చేస్తున్న ఆర్ఎంపీ వైద్యం. ఒకరేమో రోగులను ఆర్థికంగా గుల్ల చేస్తుంటే, మరొకరు పరిధికి మించి వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలను హరిస్తున్న చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న అధికారుల తీరు మరీ విడ్డూరం. ఆదివాసీల అమాయకత్వాన్ని, పేదల అవసరం ఆసరా చేసుకుని మెడికల్ షాపుల యజమానులు డాక్టర్లలా సలహాలు ఇస్తూ అడ్డగోలుగా మందులు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా యథేచ్ఛగా నాసిరకం మందుల దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్ల ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 20 పైగా మెడికల్ షాపులు ఉండగా వీటిలో చాలా వరకు ఫార్మాసిస్టులు లేకుండానే విక్రయాలు చేస్తున్నారు. రోగి మెడికల్ షాపులకు వెళ్లి జబ్బు పేరు చెబితే షాపు నిర్వాహకులే మందులు ఇస్తున్నారు. కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఏ మందులు ఎన్ని రోజులు వాడాలో మెడికల్ షాపుల నిర్వహకులే చెబుతారు. ఈ విధంగా చర్ల ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలుగా తమ వ్యాపారం చేస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోగుల నుంచి అధికంగా దండుకోవచ్చని, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మెడికల్ షాపులో బీ ఫార్మసీ పూర్తి చేసిన వారేఉంటూ మందులు ఇవ్వాలి. కానీ చర్ల ఏజెన్సీ ప్రాంతంలో చాలా వరకు అద్దెకు సర్టిఫికెట్లు తెచ్చుకొని లైసెన్స్ తీసుకొని మెడికల్ దుకాణాలను నిర్వహిస్తున్నావారే అధికంగా ఉన్నారు. ఇప్పుడు చిన్న క్లినిక్ నుంచి నర్సింగ్ హోం వరకు ఎవరికీ వారే మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకుని నిర్వాహకులె మందులు అమ్మీ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ రూమ్ పక్కనే మెడికల్ షాపులు ఓపెన్ చేసి వైద్యం చేస్తున్నారు. నిజానికి ఆర్ఎంపీల వద్ద ఏ మందులు ఉండకూడదు. వారి వద్దకు వచ్చిన వారికి ప్రధమ చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇష్టానుసారంగ తమ పరిధికి మించి వైద్యం చేస్తూ ఇటీవల చర్ల మండలంలో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, వారి ప్రాణాలను హరించడం ఆర్ఎంపీ వైద్యులకు సర్వ సాధారణం అయిపోయింది.చర్ల ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ షాపులపై జౌషధ నియంత్రణ అధికారుల మరియు పరిధికి మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలపై జిల్లా వైద్య అధికారుల నిఘా కొరవడింది. జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎప్పుడూ వస్తారో,ఎప్పుడూ తనిఖీ చేస్తారో తెలియకుండా ఉంది. ఏది ఏమైనా ఔషధ నియంత్రణ అధికారులు , జిల్లా వైద్య అధికారులు స్పందించి అర్హత లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్న వారిపై, పరిధికి మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఆర్ఎంపీ లపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.