సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక్క అంశం చుట్టూ తిరగడం లేదు. ప్రతి రోజూ రాజకీయం చేసుకోవడానికి చాలా టాపిక్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి మూసి ప్రక్షాళన. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఆరోపణలు..కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తాజాగా అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్ గా ముందుకెళ్తోంది. అందుకు కాంగ్రెస్ పార్టీకి దొరికిన ఆయుధం.. నల్లగొండ. దీంతో బీఆర్ఎస్ కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ సెంటిమెంట్‌ను పండించి.. బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తే అది నల్లగొండ ప్రజల్ని వ్యతిరేకించినట్లే అన్న భావన తీసుకు వచ్చేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పరిధిలో పుట్టిన రోజున రోజు నాడు పాదయాత్ర చేశారు. మూసి ప్రాంత ప్రజలతో పాటు మూసి కాలుష్యం వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఆయన పరిశీలిస్తారు. పాదయాత్రకు నల్లగొండజిల్లాలోని మూసీ ప్రాంతాలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఎంచుకున్నారని అర్థమయిపోతుంది. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా నేతలంతా పాల్గోనడంతో పార్టీకి బలం చేకూరినట్టైంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా మూసి ప్రక్షాళనను అడ్డుకంటే నల్లగొండ ప్రజలు ఊరుకోరని హెచ్చరిస్తూ వస్తున్నారు. నల్లగొండ ప్రజల్ని ఎందుకు హింసిస్తారని మూసి విషం ఎందుకు నల్లగొండ జిల్లా ప్రజలు తాగాలని ప్రశ్నిస్తూ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. మూసి నది ఎక్కువగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రవహిస్తుంది. హైదరాబాద్ లో కలిసే మురికి , డ్రైనేజీ అంతా నల్లగొండకే వస్తోంది. దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే ఎక్కువగా నష్టపోయేది నల్లగొండ జిల్లా వాసులేనని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని దానిలోని దోపిడీకే వ్యతిరేకం అంటున్నారు. అందుకే అడ్డుకుంటున్నామని అంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ వాదనను తిప్పి కొట్టేందుకు రెడీ అయ్యారు. అసలు పనులే ప్రారంభించక ముందు ఈ రకమైన దోపిడీ వాదనను ప్రజలు ఎందుకు అంగీకస్తారని.. పనుల్ని అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారని అనుకుంటారని అంటున్నారు. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకి అయినా నల్లగొండ జిల్లా కీలకం. నల్లగొండ జిల్లాపై ఆశలు వదులుకుంటే..మరోసారి అధికారంలోకి రావాలన్న కల చెదిరిపోతుంది. అందుకే మూసి విషయంలో బీఆర్ఎస్ రాజకీయాన్ని కాంగ్రెస్ నల్లగొండ సెంటిమెంట్‌తో ఎదుర్కొంటోంది.