సిరా న్యూస్, భీమదేవరపల్లి
మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
* దేశమంతా ఉచితంగా భారత రాజ్యాంగాన్ని పంపిణీ చేయాలి
మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు.శనివారం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలోని 28 రాష్ట్రాలలో, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి ఇంటింటికి భారత రాజ్యాంగాన్ని ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. మన దేశంతో పాటు మిగతా దేశాలలో కూడా అంబేద్కర్‌ని, ఆయన ఆలోచన విధానంతో విగ్రహాలను ఏర్పాటు చేస్తు తన ఆలోచనను అనుసరిస్తూ ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన ప్రపంచ విజ్ఞాన దినోత్సవం గా ప్రకటించారని తెలిపారు. కనుక తాను రచించిన రాజ్యాంగంను భారతదేశంలోని ప్రతి ఇంటింటికి అందజేస్తు రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేశారు.దేశ చరిత్ర కాలగర్భంలో కలిసిన మహానీయుల జీవిత చరిత్రలను వారి ఆశయాలను ,ఆలోచనలు అనునిత్యం అనుసరించాలంటే వారి యొక్క జీవిత చరిత్రలను పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పిల్లవానికి భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్, బీసీ నాయకులు వేముల జగదీష్, గిరిమల్ల చంద్రమౌళి, గంగారపు రవీందర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.