సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకదాని రేట్లు కాస్త తగ్గుతున్నాయనే సరికి మరొక వస్తువు ధర పెరిగేందుకు రెడీగా ఉంటోంది. మొన్నటివరకు ఉల్లిగడ్డలు కన్నీళ్ళు తెప్పించాయి. టమాల ధరలు కొండెక్కగా పచ్చి మిర్చి కూడా మిన్నంటింది. ఇలా ఒక్కొక్కటిగా ధరల్లో మండిపోతూ సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గత నెల కార్తీకమాసం కావడంతో చికెన్, గుడ్ల లెక్కలు కాస్త తగ్గుదల కనిపించింది. కార్తీకమాసం ముగిసిన తర్వాత కోడి గుడ్ల వినియోగం విపరీతంగా పెరగటంతో ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం రూ.5.50 మాత్రమే ఉండగా.. వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. ఇప్పుడు ఏకంగా రూ.7 నుంచి 8 గా పలుకుతోంది.వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.84కు చేరుకోవటం గమనార్హం. హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.76 ఉండగా.. రిటైల్ మర్కెట్లో రూ.7గా అమ్ముతున్నారు. కొన్ని దుకాణాల్లో అయితే రూ.7.50, రూ.8గా కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం ఒక కేసు గుడ్ల ధర రూ.180 నుంచి రూ.200 పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. మరోవైపు.. చికెన్ ధర కూడా పెరిగిపోయింది. గత నెలలో కిలో చికెన్ రూ.170 నుంచి రూ.190 వరకు ఉండేది. అయితే తాజాగా రూ.240కి చేరటం గమనార్హం. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ ఈవెంట్స్ రావడంతో ప్రతి ఒక్కరూ బిర్యానీలకు మొగ్గు చూపారు. దీంతో చికెన్ డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదునుగా భావించి వ్యాపారస్తులు ధరలు పెంచేస్తున్నారు. మరో 10 రోజుల తరువాత సంక్రాంతి పండుగ ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంట్లో నాన్ వెజ్ వండుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.