సిరాన్యూస్, ఆదిలాబాద్
భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డును పటిష్ట పర్చాలి : సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే ప్రతిపాదనను మానుకోవాలి
* నేతాజీ చౌక్‌లో సంతకాల సేకరణ
భవన నిర్మాణ కార్మిక హెల్పర్ బోర్డు ద్వారా అమలు చేస్తున్న స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకుఇవ్వాలనే ప్రతిపాదనను మానుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల నేతాజీ చౌక్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ…తెలంగాణ భవన నిర్మాణము మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు అమలు చేస్తున్న స్కీములను సహజ మరణం ప్రమాదవశాత్తు మరణం పాక్షిక అంగవైకల్యం శాశ్వత అంగవైకల్యం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడం ద్వారా వెల్ఫేర్ బోర్డు నిధులను ఈరోజు ప్రైవేటుపరం చేయడానికి చేస్తున్న ఆలోచనలను ఉపసంహరించుకోవాలని అన్నారు. వెల్ఫేర్ బోర్డు పటిష్ట పరచాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టి ముఖ్యమంత్రి కి వినత పత్రం రూపంలో అందజేయడం జరుగుతుందని అన్నారు. కార్మికుల అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 1979 వలస కార్మిక చట్టాన్ని 1996 కేంద్ర భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా విధానాలను రూపొందించడం సబబు కాదన్నారు. ప్రమాదవశాత్తు సహజంగా మరణించిన భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. 65 సంవత్సరాలు నిండిన కార్మికులకు ప్రతి నెల 10 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలిపారు. దహన సంస్కారాలు ప్రసూతి కానుక పెళ్ళికానుకను లక్ష రూపాయలకు పెంచాలని, 2009 సంవత్సరంలో ఇచ్చిన వెల్ఫేర్ బోర్డు కార్డులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన రెన్యువల్ చేయాలని తెలిపారు. వెల్ఫేర్ బోర్డు నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించొద్దని, బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి పరిరక్షించాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్స్ లో 16వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాన్ని 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఐఎఫ్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ,జిల్లా నాయకులు సుభాష్,నర్సింగ్,దేవిదాస్, మారితి,( టీయూసీఐ ) జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్, సహాయ కార్యదర్శి ఉమ్రే నితిన్, ఉపాధ్యక్షులు సర్కలే రాజు,సీఐటీయూ నాయకులు అశోక్,విట్టల్,బాగువన్ తదితరులు పాల్గొన్నారు.