సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తాం
* జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవికి వినతి పత్రం అందజేత
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. గురువారం ఆరోగ్య మిత్రులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవి కి వినతి పత్రాన్నిఅందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఐటీయూ ఆరోగ్యమిత్ర రాష్ట్ర నాయకత్వంతో వెంటనే చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి కార్యచరణ రూపొందించాలని, లేనిపక్షంలో సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు. గత 17 సంవత్సరాలుగా ఆరోగ్య మిత్రలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. కనీస వేతనాలు ఉద్యోగ భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదని తెలిపారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించక ఆరోగ్య మిత్రులు సమ్మెబాట పట్టే పరిస్థితిని కల్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆరోగ్య మిత్రుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా కార్యచరణ రూపొందించాలన్నారు.సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్, ఆరోగ్య మిత్రా జిల్లా నాయకులు శ్రీనివాస్, విశ్వనాథ్, భీమ్రావు, అనిత, సుజాత, గంగామణి తదితరులు పాల్గొన్నారు.