టెన్త్ పరీక్షలపై రాని క్లారిటీ

సిరా న్యూస్,హైదరాబాద్;
ఓవైపు పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. మరోవైపు పరీక్షల విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. పరీక్షలు ఏ ఫార్మాట్‌లో ఉంటాయి.. విద్యార్థులను ఎలా సన్నద్ధం చేయాలని టీచర్లు ఆందోళన చెందుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రం సరళి ఎలా ఉంటుందో తెలియక.. ఇటు ఉపాధ్యాయులు.. అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని టీచర్లు వివరిస్తున్నారు. పాఠశాల స్థాయిలో కూడా పరీక్షలు నిర్వహించాలని చెబుతున్నారు.గతంలో ఆరు సబ్జెక్టులకు గానూ.. 11 పేపర్లు ఉండేవి. ఒక్క హిందీ మినహా.. మిగిలిన అన్నింటికి రెండేసి పేపర్లు ఉండేవి. పరీక్షలు 11 రోజులు జరిగేవి. దీని కారణంగా విద్యార్థుల పై ఒత్తిడి పెరుగుతోందని భావించిన ప్రభుత్వం.. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్ మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్షలు ఆరు రోజుల్లో ముగిసేవి.అయితే.. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్ ఉండేలా తీసుకున్న నిర్ణయం పర్మినెంట్ కాదు. కేవలం 2022- 23, 2023 -24 విద్యా సంవత్సరానికి మాత్రమేనని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎలా పరీక్షలు నిర్వహించాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత విధానాన్నే కొనసాగిస్తారా.. కొత్త విధానాన్ని ప్రవేశపెడతారా అన్న అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందిప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని.. ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వారు ప్రతిపాదనలు పంపి నెల రోజులు కావొస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థులు, పాఠాశాలల ప్రధానోపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం చెబితే.. దాని ప్రకారం విద్యార్థులను సన్నద్ధం చేస్తామని చెబుతున్నారు.
గతేడాది వరకూ.. వ్యాసరూప ప్రశ్నం 6 ఇచ్చేవారు. వాటిల్లో నాలుగింటికి సమాధానాలు రాయాలి. వాటికి 24 మార్కులు ఉండేవి. లఘు ప్రశ్నలు 6 ఉండేవి. ఆరింటికి సమాధానం రాయాలి. వాటికి 24 మార్కులు ఉండేవి. షార్ట్ క్వశ్చన్స్ కూడా 66 ఉండేవి. ఆరింటికి సమాధానాలు రాయాలి. వాటికి 12 మార్కులు ఉండేవి. మల్టిపుల్ ఛాయిస్ కింద 20 ప్రశ్నలు అడిగేవారు. వాటికి ఒక్కో మార్కు చొప్పున 20 మార్కులు ఉండేవి. మొత్తం 80 మార్కులకు ప్రశ్నాపత్రం ఉండేది.అయితే.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఎలాంటి పేపర్‌ను డిజైన్ చేస్తుందో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే గందరగోళ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రభుత్వం తొందరగా నిర్ణయం ప్రకటిస్తే.. దానికి తగ్గట్టు విద్యార్థులను సన్నద్దం చేయొచ్చని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *