సిరా న్యూస్;
ప్రస్తుత ప్రపంచానికి నూతన సవాల్‌గా వాతావరణ శరణార్థులు మారుతున్నారు. 2010 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మంగోలియా నుండి మెక్సికో వరకూ, ఐస్ లాండ్ నుంచి సౌత్ ఆఫ్రికా వరకూ వాతావరణ శరణార్థులు పెరుగుతూ పలు దేశాల్లో నూతన సమస్యలకు కారణం అవుతున్నారు అని తెలుస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి, అవిద్య, అనారోగ్యం, పోషకాహారం, ప్రాదేశిక సమగ్రతకు, రకరకాల వివక్షలకు, పేదరికం, మానవ హక్కుల సమస్యలకు వాతావరణ శరణార్థులే కారణం అవుతున్నారు.2021 ఏప్రిల్ ఐక్యరాజ్యసమితి శరణార్థుల కమిషనర్ (యుయన్‌హెచ్ఆర్‌సి) డేటా ప్రకారం 2010 సంవత్సరం నుంచి 2 కోట్ల 15 లక్షలమంది వాతావరణ శరణార్థులుగా మారినట్లు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన “ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ (ఐఈపీ) అంచనా – 2018 ప్రకారం 2030 నాటికి 120 కోట్ల మంది వాతావరణ శరణార్థులుగా మారే అవకాశం ఉంది. దీనిని బట్టి వాతావరణ శరణార్థులు భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మారుతున్నారు… ప్రపంచ దేశాలు ఈ సమస్య పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలి.ఈ సమస్యను ముందుగా అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి “గ్లోబల్ కాంపాక్ట్ ఆన్ సేఫ్” అనే ప్లాట్ ఫాం ఏర్పాటు చేసి, సుమారు 130 దేశాల్లో వాతావరణ శరణార్థుల నిమిత్తం బ్రాంచీలు ఏర్పాటు చేసింది. 2026 నాటికి వాతావరణ శరణార్థులు ఎక్కువగా మారుతున్న 22 దేశాలలో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది.. అమెరికా-మెక్సికో మధ్య ఎక్కువగా శరణార్థులు మారుతున్నారు. మెక్సికో నుంచి అమెరికాకు గత కొన్నేళ్లుగా వేల సంఖ్యలో వలసలు ఉంటున్నాయి. సెంట్రల్ అమెరికా నుంచి అమెరికా దేశానికి ఒక్క 2022లోనే 2 లక్షల 50 వేల మంది వలసబాట పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇటీవల కాలంలో ముఖ్యంగా కోవిడ్-19 అనంతరం శ్రీలంక, మాల్దీవులు, ఫిజీ నుంచి ఇతర దేశాలకు వలసలు పెరిగాయి. ఈ వలసలకు వాతావరణ మార్పులు, తుఫాన్లు, వరదలు, కరువులు, భూకంపాలు అగ్నిపర్వతాలు, విస్ఫోటనం, అడవుల దహనం, కొండలు గుట్టలు విరిగిపడటం, మంచు తుఫాన్లు, హరికేన్లు, ఎడారీకరణ, భూతాపం, సునామీలు వంటి ప్రకృతి విపత్తులే కారణమవుతున్నాయి. మానవ తప్పిదాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధాలు, వివక్షలు, అసమానతలు, గ్లోబల్ వార్మింగ్ వంటివి కూడా శరణార్థులుగా మారడానికి కారణం అవుతున్నాయి. ఉద్యోగ ఉపాధి లేకపోవడం, మహిళలు బాలికలపై అఘాయిత్యాలు, అవమానాలు, ప్రభుత్వాల విధానాలు కూడా వివిధ దేశాల నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి మారడానికి కారణం అవుతున్నాయి.ముఖ్యంగా వాతావరణం మార్పులను అదుపుచేయాలి. “కాప్” సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాలు అన్ని దేశాలు తూ.చ తప్పకుండా అమలు చేయాలి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాల అదుపునకు చర్యలు చేపట్టాలి. అడవుల నరికివేత ఆపాలి. టూరిజం పేరుతో పర్యావరణానికి హాని చేయరాదు. విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో. కొండలు గుట్టలను అస్తవ్యస్తం చేయరాదు. జోషి మఠ్‌లో ఏమి జరిగిందో మనం అందరం ఇటీవల చూసాం.భూతాపం అదుపుచేయాలి. శిలాజ ఇంధన వాడకం తగ్గించాలి. ఈ-వెహికల్స్ వాడకం పెంచాలి. సైకిల్, నడక వంటి ప్రయాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణ శరణార్థులకు మానవ హక్కులను ప్రసాదించాలి. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా ఆధునీకరణ పేరుతో జరుగుతున్న ప్రకృతి వనరుల ధ్వంసాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు యుద్ధ ప్రాతిపదికన నియంత్రించకపోతే, భవిష్యత్తులో ఈ భూమి మీద మనుషులే కాదు ఏ రకమైన జంతుజాలం మనజాలదు అందరూ గ్రహించాలి.. ఇకనైనా సమిష్టిగా మంచి వాతావరణ ఏర్పాటుకు అందరూ కలిసి పనిచేయడమే మన అందరి బాధ్యత.