సిరా న్యూస్, డిజిటల్:
సమగ్ర శిక్ష ఉద్యోగుల డైరీ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
+ రెగ్యులరైజేషన్, పే స్కేల్ గురించి సీఎం కు విన్నవించిన ఉద్యోగులు
+ సమస్యలు పరిష్కరిస్తామని హామీ
సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అసోసియేషన్ డైరీ ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర శిక్ష అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సహదేవ్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దుండిగల్ యాదగిరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల రవీందర్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా, రాష్ట్ర కోశాధికారి కంచర్ల మహేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్టు చందులాల్ తదితరులు సీఎంకు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం హామీ ఇవ్వడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వెంటనే రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు పే స్కేల్ అమలు చేయాలని కోరారు. కాగా సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర కార్యవర్గంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి అవసరమైన ఉన్న అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. వారి వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, తదితరులు ఉన్నారు. అంతకు ముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని కలిసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకున్నారు.