సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు చేయూత
సిరా న్యూస్,హైదరాబాద్ ;
బుధవారం నగరంలో ఎంఎస్ఎంఈ పాలసీ-2024ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఈ పాలసీని సీఎం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నామంటే మాజీ ప్రధాన మంత్రులు పీవీ, మన్మోహన్ సింగ్ లు తీసుకొచ్చిన సంస్కరణలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ ప్రధాని అయ్యాక పారిశ్రామిక విధానంలో మార్పులు తెచ్చారని కొనియాడారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సృష్టించేందుకే ఈ పాలసీని తెచ్చినట్లు ఆయన చెప్పారు. సరసమైన ధరలకు భూమిని అందించడం, ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచడం, ముడి పదార్థాల లభ్యతను అందుబాటులో ఉంచడం, నైపుణ్యం గల కార్మికుల లభ్యత మెరుగు పరచడం, నూతన సాంకేతికతను ప్రోత్సహించడం, మార్కెట్ లతో అనుసంధానత మెరుగుపరచడం వంటి అంశాలతో ఎంఎస్ఎంఈలకు దన్నుగా నిలవబోతున్నట్లు అయన పేర్కోన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామికి పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య 10పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మించబోతున్నదని తెలిపారు. పాలసీ లేకుండా ఏ ప్రభుత్వమూ నడవదని.. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్ హామీలను తాము నెరవేరుస్తామని సిఎం చెప్పారు.. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు, పరిశ్రమల శాఖకు సంబంధించిన 22 అసోసియేషన్స్ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.