స్థానికుల చోరవతో విముక్తి
సిరా న్యూస్,జగిత్యాల;
ఓ నాగుపాము వలలో చిక్కుకుంది. బయటకు వెళ్లేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. కానీ వల చుట్టు చుట్టుకోవటంతో బయటకు వెళ్లటానికి వీలులేకా నరకయాతన పడింది. నాలుగురోజులు వల వలయంలో చిక్కుకున్న నాగుపాముకు స్థానికులు విముక్తి కలిగించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ శివారులో నాలుగు రోజుల క్రితం ఓ నాగుపాము అడవిలో తిరుగుతున్న క్రమంలో గంగపుత్రులు పంట పొలాల చుట్టు పెట్టిన వలలో చిక్కుకుంది. తలనుండి తోక వరకు పాముకు వల చుట్టుకోవటంతో బయటకు వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. మూడు రోజుల క్రితం అటుగా వెళుతున్న కటుకం రాము అనే వ్యక్తి పామును చూసాడు. తనకు తానే వెళ్లిపోతుందని అనుకున్నాడు. కానీ నాలుగు రోజులు గడిచినా పాము అదే వలలో వుండిపోవడం, బయటకు వచ్చేందుకు ప్రయత్నం చెయ్యడం చూసి ఎలాగైన పామును కాపాడాలనుకున్నాడు. ఇతరుల సాయంతో కత్తెరతో చేపలు పట్టె వలను కత్తిరించి జాగ్రత్తగా పామును బయటకు తీసారు. ఆ తర్వాత అడవిలోకి వదిలేసారు. నాలుగు రోజులపాటు నరకయాతన అనుభవించిన నాగుపాము బతుకుజీవుడా అంటు బుసలు కొడుతూ వెళ్లిపోయింది.