సిరాన్యూస్, ఆదిలాబాద్
మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా అధికారులకు తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరం లో ఏర్పాటు చేసిన అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులు, మహిళా శక్తి కార్యక్రమాల పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి లక్ష్యంతో వచ్చే ఐదేళ్ళ లో మహిళలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా 15 రకాల కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. అందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టుపనిని వారికే అప్పగించిందని, మహిళా శక్తి క్రింద మైక్రో ఎంట్రప్రెన్యూర్స్, కుట్టు కేంద్రాలు, పాడి పశువులు, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, పౌల్ట్రీ మథర్ యూనిట్స్, సంచార మత్స్య విక్రయ ఔట్ లెట్లు, మిల్క్ పార్లర్స్, మీసేవ, ఈవెంట్ మేనేజ్మెంట్, మహిళా క్యాంటీన్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్స్, కస్టం హైరింగ్ కేంద్రాలు వంటి 15 రకాల కార్యకలాపాలు చేపట్టుటకు మండలాల వారీగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈకార్యాచరణ ప్రకారం వివిధ మండలాలలో గల మహిళా సమాఖ్య లోని స్వయం సహాయక సంఘాల ద్వారా వివిధ యూనిట్లు నెలకొల్పడమే లక్ష్యంగా ఇప్పటి నుండే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్న శిక్షణ తరగతులకు ఔత్సాహికులైన క్రియాశీలక మహిళా సంఘాల సభ్యులను ఎంపిక చేయాలని అన్నారు. అనంతరం అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార చేపడుతున్న నిర్మాణ పనుల పై ఆరాతీసి ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు .నాణ్యతా ప్రమాణాలు పాటించి, ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.మండలాల వారిగా పురోగతిని అడిగి తెలుసుకుని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో డీఆర్‌డీఓ సాయన్న, డీఏహెచ్ ఓ, డీపీఓ , డీపీఎం సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.