సిరా న్యూస్, నిర్మల్:
ఖానాపూర్ కమిషనర్ కుర్చేది??
+ ఎమ్మెల్యే కార్యక్రమంలో కుర్చీ లేక నిల్చున్న ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్
+ నాయకులు తీరుపై సర్వత్ర విమర్శలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ల సమీపంలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కూర్చోవడానికి కుర్చీ లేకుండా పోయింది. వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ప్రారంభోత్సవం అనంతరం సభ నిర్వహించారు. అయితే సభ జరుగుతున్నంత సేపు కూడా ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ వెనకాల నిల్చోని ఉండటం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగానే కమిషనర్ కు కుర్చీ ఇవ్వకుండా నిలబెట్టారని, విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారడంతో, సాయంత్రం నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే దీనిపై స్పందించారు. సభ నడుస్తున్న సమయంలో కరెంటు పోవడంతో సంబంధిత అధికారులకు ఫోన్ చేసేందుకు మున్సిపల్ కమిషనర్ బయటకు వెళ్లారని, ఖాళీగా ఉన్న కుర్చీలో వేరే ఎవరో వచ్చి కూర్చోవడంతో ఆయనకు కుర్చీ లేకుండా పోయిందని అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ప్రతిపక్ష నాయకులు తనపై, ప్రభుత్వంపై పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.