ఏపీపై కాంగ్రెస్ దృష్టి…

సిరా న్యూస్,విజయవాడ;
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ వైసిపికి ఓటమి ఎదురైతే నే కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకులు, క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీదే. కానీ సంతృప్తికర స్థాయిలో నేతలతో పాటు క్యాడర్ లేదు. ఒకవేళ ఏపీలో వైసీపీ ఓడిపోతే.. కాంగ్రెస్ ఆటోమేటిక్ గా బలోపేతం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పదవులు అనుభవించిన వారు ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోయింది. దీంతో నాయకులు వైసిపి బాట పట్టారు. కానీ అక్కడకు వెళ్లిన వారు ఏమంత సంతృప్తికరంగా లేరు. బొత్స సత్యనారాయణలాంటి నాయకుడు 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆశించి.. ఆయన వైసీపీలో ఆలస్యంగా చేరారు. ఇప్పుడున్న సీనియర్లకు జగన్ అంటే మింగుడు పడడం లేదు. కానీ ప్రత్యామ్నాయంగా వేరే అవకాశం లేదు. అదే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే మాత్రం వైసీపీలో కీలక నేతలు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది.ఇక కాంగ్రెస్ అధినాయకత్వం ఫోకస్ ఏపీ పై పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. పార్టీ హై కమాండ్ తో నేరుగా ఆమె చర్చలు జరిపారు. కానీ ఎందుకో ఆమె కాంగ్రెస్ లో చేరకుండా.. ఎన్నికల్లో బాహటంగా మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ విజయం సాధించడంతో షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఆమె కాంగ్రెస్లో చేరితే ఏపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీలో చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఖాయమని టాక్ నడుస్తోంది.వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓటమి చవిచూస్తే.. ఆ పార్టీలోనే అసంతృప్త నాయకులు, సీనియర్లు సొంత పార్టీలోకి క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *