సిరా న్యూస్;
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓ 30 పార్టీలతో జతకట్టి ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో కూటమిని కట్టి భారతీయ జనతా పార్టీని కొంత మేర నిలువరించగలిగింది. అంతే తప్ప బీజేపీ సారథ్యంలోని ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను చూస్తే బీజేపీతో ముఖాముఖి ఒంటరిగా తలపడ్డ అనేక సందర్భాల్లో ఓటమి పాలవుతూ వస్తోందని అర్థమవుతోంది.తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా బీజేపీని ఢీకొట్టలేక హర్యానాలో చతికిలపడగా.. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో జతకట్టి గెలుపును సొంతం చేసుకుంది. ఇంకా లోతుగా వెళ్తే.. ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్ నేరుగా తలపడ్డ చోట్ల కమలదళానిదే పైచేయి. కాంగ్రెస్ పోటీ చేసిన 39 సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ గెలిచిన సీట్లలో ఒక్కటి కూడా హిందూ జనాభా ఎక్కువగా ఉన్న సీటు లేదు. గెలిచిన అభ్యర్థుల్లో ఒక్కరు కూడా హిందువు లేరు. దీన్ని బట్టి ఆ కొన్ని సీట్లు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పుణ్యమే అని స్పష్టమవుతోంది.హర్యానాలో జాట్-దళిత-మైనారిటీ కాంబినేషన్‌తో ఒంటరిగా గెలుపొందాలని చేసిన ప్రయత్నం చాలావరకు కలిసొచ్చినా.. జాటేతర వర్గాలు బీజేపీ వైపు ఏకీకృతం కావడంతో అనుకున్నది సాధించలేకపోయింది. కనీసం ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బహుజన్ సమాజ్ పార్టీలలో ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకున్నా పరిస్థితి మరోలా ఉండేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతంలో వ్యత్యాసం 1 శాతం కంటే తక్కువే. బీజేపీ 39.94% ఓట్లతో 48 సీట్లు గెలుపొందగా, కాంగ్రెస్ 39.09% ఓట్లు సాధించినప్పటికీ 37 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆప్ (1.79%), బీఎస్పీ (1.82%), ఐఎన్ఎల్డీ (1.14%) ఓట్లు సాధించాయి. అనేక నియోజకవర్గాల్లో గెలుపోటముల మధ్య తేడా వందల్లోనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఏ ఇతర పార్టీతో జతకట్టినా కాంగ్రెస్ అధికారం సాధించగలిగేదని స్పష్టమవుతోంది. జాతీయస్థాయిలో బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా 30 పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కాంగ్రెస్, అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొన్నిచోట్ల మాత్రం “తాను మాత్రమే గెలవాలి.. మరొకరికి భాగం ఉండరాదు” అన్నట్టుగా వ్యవహరించింది. తనకు తగిన బలం లేదు అనుకున్న రాష్ట్రాల్లో మాత్రమే స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలతో జట్టుకట్టి పోటీ చేస్తోంది.గతంలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీతో కాంగ్రెస్ నేరుగా తలపడి ఓటమిపాలైంది. ఉత్తరాదిన హిమాచల్‌లో మాత్రమే గెలుపొందగలిగింది. తెలంగాణలో విజయం సాధించినప్పటికీ.. అక్కడ పోటీపడింది కేవలం బీజేపీతో మాత్రమే కాదు. అప్పటి వరకు తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితితో తలపడి ముక్కోణపు పోటీలో 39% ఓట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ లెక్కన చూస్తే బీజేపీతో నేరుగా తలపడడంలో కాంగ్రెస్ తడబడుతోందని స్పష్టమవుతోంది. ఓ ఇద్దరు ముగ్గురిని వెంటేసుకుని వెళ్తేనో.. లేకపోతే ముక్కోణపు పోటీ లేదా బహుముఖ పోటీ ఉన్నప్పుడో కాంగ్రెస్ విజయాలు సాధించగల్గుతోంది. హిందీ హార్ట్‌ల్యాండ్‌గా పేరుగాంచిన ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీ నేటికీ పట్టు సాధించలేకపోతోంది. గత పదేళ్లలో చత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అధికారం అందినా ఐదేళ్ల తర్వాత రెండోసారి గెలుపొందలేకపోయింది.ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు సాధిస్తే తప్ప జాతీయ రాజకీయాల్లో విజయాలు సాధించలేమని ఆ పార్టీ వ్యూహకర్తలకు తెలుసు. 90వ దశకం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ సారథ్యంలో 3 సార్లు ప్రభుత్వాలు ఏర్పడినా.. వాటిలో ఒక్కసారి కూడా పూర్తి మెజారిటీతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. పీవీ నరసింహారావు సైతం పూర్తి మెజారిటీ లేని ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడపగా.. తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో కూడా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటయ్యాయి. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ మాత్రం నానాటికీ బలపడుతూ హిందీ రాష్ట్రాల్లో గట్టి పట్టు సాధిస్తూ ముందుకు కదులుతోంది. గత మూడున్నర దశాబ్దాల్లో బీజేపీ 2 పర్యాయాలు సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ మార్కు దాటింది. ఈసారి కాస్త 30కి పైగా పార్టీలతో ఏర్పడ్డ ఇండి-కూటమిని ఎదుర్కోవడంలో కాస్త తడబడాల్సి వచ్చింది.గత ఏడాది 34 పార్టీలతో ఏర్పాటైన ఇండి-కూటమి అనేక రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసినప్పటికీ.. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బీజేపీని ఢీకొట్టింది. వాటిలో దక్షిణాదిన కర్ణాటకలో మాత్రమే నేరుగా బీజేపీతో తలపడగా, మిగతా రాష్ట్రాల్లో స్థానిక ప్రాంతీయ పార్టీలు, కూటములతో తలపడింది. కర్ణాటకలో బీజేపీ మీద, తెలంగాణలో బీఆర్ఎస్ మీద మెరుగైన ఫలితాలు సాధించింది. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి 20కి 18 చోట్ల గెలుపొందింది. తమిళనాడులో మిత్రపక్షం ద్రవిడ మున్నేట్ర కళగం తో కలిసి గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.ఇక, ఉత్తరాది రాష్ట్రాల్లో.. బిహార్, జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్‌లో స్థానికంగా బలంగా ఉన్న మిత్రపక్ష ప్రాంతీయ పార్టీలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. బెంగాల్‌లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసినా ఆ రాష్ట్రంలో ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ మధ్యనే సాగింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో జట్టుకట్టినా, ఆ స్నేహం పంజాబ్‌లో అమలు కాలేదు. అయితే కొన్ని చోట్ల ఈ కూటములు, పొత్తులు ఫలించి కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. మహారాష్ట్రలో శివసేన (ఉద్దవ్ బాల్ ఠాక్రే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)తో కలిసి కొన్ని సీట్లు, యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి కొన్ని కాంగ్రెస్ ఖాతాలో అదనంగా చేరాయి.హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవిగా మారిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 99 సీట్లలో సగం వరకు మిత్రపక్షాల బలంతోనే వచ్చాయని సూత్రీకరించారు. అయితే మిత్రపక్షాలు కాంగ్రెస్‌పై ఆధారపడిన రాష్ట్రాల్లో వారి ఎన్నికల నౌకలు మునిగిపోయాయాని తెలిపారు. కాంగ్రెస్ ఎంత పరాన్నజీవి అంటే అది తన సొంత మిత్రులను మింగేస్తుందని మోదీ విరుచుకుపడ్డారు. “తన గెలుపు కోసమే పొత్తు.. తాను ఒంటరిగా గెలిచేలా ఉంటే ఎవరూ వద్దు” అన్నది కాంగ్రెస్ విధానంగా కనిపిస్తోంది. అదే ఇప్పుడు ఆ పార్టీని వరుస ఓటములతో ముంచేస్తోంది.