పోయిన చోటే వెతుక్కునే పనిలో కాంగ్రెస్

సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో పూర్తిగా జీరో స్థాయికి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బలపడటానికి ఓ అవకాశం షర్మిల రూపంలో లభించింది. వైఎస్ కుటుంబంలో వచ్చిన విబేధాలో తెలంగాణలో షర్మిల సక్సెస్ అవకపోవడమో కారణం ఏదైనా.. వైఎస్ కుమార్తె రూపంలో మరోసారి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకు రావడానికి ఓ ప్రయత్నం అయితే ప్రారంభమయింది. ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయం పక్కన పెడితే.. ముందు షర్మిల పనితీరులో అంచనాలను అందుకోగలరా అన్న సంశయం చాలా మందిలో ఉంది. యూపీఏ ప్ర‌భుత్వానికి పెద్ద అండ‌గా ఉన్న‌ది కూడా ఉమ్మ‌డి ఏపీ కాంగ్రెస్ ఎంపీల బ‌ల‌మే. రాష్ట్ర విభజన, వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీ శ్రేణులను తనవైపు ఆకర్షించడంలో సఫలీకృతమయ్యారు. కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేకపోవడంతో బలపడటం సాధ్యం కాలేదు. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన ఆయన అసలు పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోలేదు. తర్వాత ఆయన కూడా బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం దిశగా నడిపించడానికి కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుసుతన్నాయి. విభజన అనంతరం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల పాలనను చూసిన ఏపీ ప్రజలు ఆ రెండు పార్టీలు అందించిన పాలనపై అసంతృప్తితో ఉన్నారనే భావనతో కాంగ్రెస్‌ నాయకత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కసారి జనం కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తే ఆ పార్టీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగే అవకాశముందని ఆ పార్టీ నాయకత్వం ఆశతో ఉంది. ఇందుకోసం పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేసే వ్యూహాలకు కాంగ్రెస్ హైకమాండ్ పదును పెడుతున్నది. ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలకు అధికారం ఇచ్చినా విభజన హామీలను, ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యాయి. బిజేపీ ప‌దేళ్ల‌లో ఏనాడూ ప్ర‌త్యేక హోదా ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్‌ తన పునరాగమనానికి ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది. మరోసారి ప్రత్యేక హోదా నినాదంతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నించాలని కాంగ్రెస్ యోచిస్తున్నది ఉమ్మడి రాష్ట్ర పాలన కాలంలో కాంగ్రెస్‌ ఏపీ అభివృద్ధికి చేసింది చెప్పుకోవడానికి చాలనే ఉండగా.. పదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ ఏం చేశాయని ప్రశ్నిస్తూ ఎదురుదాడి సాగించే అవకాశముంది. అలాగే ఏపీకి విభజనతో తాము చేసిన నష్టం కంటే పదేళ్ల పాలనలో టీడీపీ, వైసీపీ, బీజేపీ చేసిన నష్టమే ఎక్కవనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే యోచనలో నాయకత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.చెల్లాచెదురైన నాయకత్వం, క్యాడర్‌ను తిరిగి సమీకరించి, ఎన్నికల సంగ్రామంలో ముందుకు నడిపించే జనాకర్షక నాయకత్వం కోసం ఏపీ కాంగ్రెస్ ఎదురుచూస్తున్నది. షర్మిల ఇప్పుడు వై సీపీ అధినేత, తన అన్న వైఎస్‌ జగన్‌ను, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీని ఆమె ఢీకొనాల్సి ఉంటుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్యం చేపడితే వైసీపీలోని పాత కాంగ్రెస్ వాదులు, జగన్ పోకడతో విసుగెత్తిన వారు అంతా తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని కాంగ్రెస్ అధినాయకత్వం ఆశిస్తున్నది. అంతేగాక టీడీపీ, వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు, ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లుతారని అంచనా వేస్తున్నది. టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని నేతలే రేపు కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదంటున్నారు.ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా కనీసం 15 శాతం ఓటు బ్యాంకు పెరిగిన ఎంపీ ఎన్నికల్లో కొన్ని సీట్లు సాధించవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతుంది. కేంద్రంలో అధికార సాధన నేపథ్యంలో దక్షిణాదిలో ఏపీ రాష్ట్రం తమకు కీలకమని కాంగ్రెస్ విశ్వసిస్తున్నది. అందుకే ఏపీలో కొన్ని ఎంపీ స్థానాలనైనా గెలువాలనుకుంటుంది. ఇందుకు సొంతంగా జనాదరణ సాధించడంతో పాటు పొత్తుల ఎత్తులను కూడా అనుసరించేందుకు పావులు కదుపుతున్నది. ముఖ్యంగా విభజన చట్టం గడువు ముగిసిపోతుండటం.. తాము వస్తేనే విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలవుతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో తిరిగి పట్టు సాధించాలనేది కాంగ్రెస్‌ ప్రయత్నంగా కనిపిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ కంటే ఏపీలోనే కాంగ్రెస్ బలంగా ఉండేది. ఒక్కసారి కాంగ్రెస్ నాయకత్వంపై జనంలో నమ్మకం కల్గిస్తే చాలని ఓటు బ్యాంక్ పెరుగుతుందని నమ్మకంతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *