Congress target KTR constituency : కేటీఆర్ నియోజకవర్గంపై కాంగ్రెస్ గురి

సిరా న్యూస్,కరీంనగర్;
చేరికలపైనా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ‌ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై మొదట గురి పెట్టింది. సిరిసిల్ల వ్యవహారాలు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే అయన సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.బీఆర్ఎస్‌కు మంచి పట్టు ఉన్న సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు అధిష్టానం ఫోకస్ పెట్టింది. గత పదేళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ వరుసగా విజయాలు సాధిస్తూ బలోపేతం అయ్యింది. అంతేకాకుండా ఇక్కడి నుంచే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సొంత సెగ్మెంట్‌పైనే దెబ్బకొడితే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ ‌నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌లో ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పదహారు మంది కౌన్సిలర్లు క్యాంపుకి వెళ్ళారు. అయితే ‌వారిని‌ ఒప్పించి మళ్ళీ సిరిసిల్లకు‌ తీసుకువచ్చారు కొంతమంది బీఆర్ఎస్ నేతలు. కానీ సిరిసిల్ల ‌మున్సిపాలిటీలో అవిశ్వాసం భయం ఇంకా వీడలేదు. దీని వెనక కాంగ్రెస్ ‌ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ‌జిల్లాకు‌ చెందిన పొన్నం ప్రభాకర్‌కు ఈ సెగ్మెంట్ ‌నేతలతో మంచి సంబంధాలు‌ ఉన్నాయి. ముందుగా సెకండ్ ‌క్యాడర్ నేతలను కాంగ్రెస్ ‌కండువా కప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ సమక్షంలో ముస్తాబాద్ జడ్పీటీసీతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు‌ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మిగతా మండలాలకు‌ సంబంధించిన నేతలతో‌ కూడా పొన్నం ‌సమావేశం‌ నిర్వహిస్తున్నారు.కేటీఆర్‌ను టార్గెట్ చేస్తే బీఅర్ఎస్ పార్టీ బలహీనపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైనా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ‌రాజకీయాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్‌ను నైతికంగా దెబ్బ తీయాలంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే చేరికలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ‌ఈ జిల్లాలో అభివృద్ధి ‌కార్యక్రమాలతో పాటు పార్టీను విస్తరించడంలో దృష్టి పెట్టారు. భూ కబ్జాదారులు, ప్రభుత్వ భూములను అక్రమించిన వారిపైనా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ‌ సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపైనా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. వీటిపైనా వెంటనే విచారణ చేపట్టాలని సమీక్ష ‌సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా కరీంనగర్‌లో భూఆక్రమణలకు పాల్పడిన కార్పొరేటర్‌లను అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికి ఈ నెల రోజులలో సిరిసిల్లలో రాజకీయ పరిణామాలు వేగంగా మారనున్నాయి. పోరాటం చేయడానికి సిధ్ధంగా ఉండాలని.. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా.. ముందుకు సాగాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారని, గతంలో మంత్రి సిరిసిల్లకు వస్తే చాలామందిని అరెస్టు చేసేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు చూసి.. కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *