60 ప్లస్ తో నిర్మాణాలు ఫోర్త్ సిటీలో ప్లానింగ్

 సిరా న్యూస్,హైదరాబాద్;
: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌. గడిచిన పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వాలు హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక అభివృద్ధి పనులు చేపట్టాయి. తెలంగాణ విభజన తర్వాత మరింత అభివృద్ధి చెందింది. తాజాగా కాంగ్రెస్‌ కూడా ఫ్యూచర్‌ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.విశ్వనంగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌.. ఇప్పుడు ఫ్యూచర్‌ సిటీ కాబోతోంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆక్రమణలను తొలగించడంతోపాటు నగరాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. నలుదిశలా అభివృద్ధి జరిగేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. జిల్లాలో ఉపాధి లేనివారు హైదరాబాద్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి హైదరాబాద్‌లో పనులు చేస్తున్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో నివాసాలకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో నిర్మాణరంగం వేగంగా విస్తరిస్తోంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ దృష్టిలో పెట్టుకుని బిల్డర్స్‌ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌ ఇపుపడు ఆకాశ హర్మ్యాలకు నిలయంగా మారుతోంది.హైదరాబాద్‌లో అత్యంత లగ్జరీ నివాస ప్రాంతంగా మారుతున్న కోకాపేటలో హైరైజ్‌ అపార్టుమెంట్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో అతి ఎత్తయిన అపార్టుమెంట్‌ గా నిర్మాణం అవుతోంది ఎస్‌ఏఎస్‌ క్రౌన్‌ కోకాపేట గోల్డెన్‌ మైల్‌ రోడ్‌లో నిర్మాణం అవుతున్న ఈ అపార్టుమెంట్‌ లగ్జరీకి మరో పేరుగా నిలుస్తోంది. నాలుగున్నర ఎకరాల్లో ఐదు టవర్లు నిర్మిస్తున్నారు. మొత్తం అరవై అంతస్తుల నిర్మాణం. ఐదు టవర్లు అరవై అంతస్తులు అయినప్పటికీ .. యూనిట్స్‌ చాలా తక్కువ. ఎందుకంటే ఇవి అత్యంత స్పేసియస్‌ అపార్టుమెంట్లు. కనీసం ఓ ఆపార్టుమెంట్‌ 6,565 స్క్వేర్‌ ఫీట్స్‌ ఉంటుంది. అంటే సాధారణ టూ బెడ్‌ రూం అపార్టుమెంట్లు వెయ్యి ఎస్‌ఎఫ్టీ అయితే.. ఏడు అపార్టుమెంట్లు కలిస్తే ఒకటన్నమాట. అతి పెద్దది 8,811 ఎస్‌ఎఫ్‌టీ ఉంటుంది.అంతర్జాతీయస్థాయి ఆర్కిటెక్చరల్‌ డిజైన్లతో ఎస్‌ఏఎస్‌ క్రౌన్‌ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అత్యధిక ఫ్లాట్లు బుక్‌ అయినట్లుగా తెలుస్తోంది. కోకాపేట వైపు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వైపు వెళ్తూంటే.. ఈ అరవై అంతస్తుల నిర్మాణం కనిపిస్తుంది. 50 అంతస్తుల పైన నివాసం ఉంటే హైదరాబాద్‌ మొత్తం కనిపిస్తుంది. ఈ అపార్టుమెంట్‌ కాంప్లెక్స్‌ ప్రారంభించి బుకింగ్స్‌ ప్రారంభించినప్పుడు ఐదు నుంచి ఏడు కోట్ల వరకూ ఒక్కో ఫ్లాట్‌ను బుక్‌ చేసుకున్నారు. ఇప్పుడు అది ఎనిమిది నుంచి పది కోట్లకు చేరిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.
పలు సూచనలు చేసిన రేవంత్
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గ్రీన్ ఫార్మా సిటీ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) శ్రీనివాసరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శషాంక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. పర్యావరణ హితంగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీలు, తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనులు చేయాలని సూచించారు. గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు. ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ & లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు.యాంటీ బయాటిక్స్, ఫెర్మంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మోటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యముంటుందని చెప్పారు. వీటితో పాటు పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *