Controversies in Kakatiya University కాకతీయ వర్శిటీలో వివాదాలు…

 సిరా న్యూస్, వరంగల్;
కాకతీయ వర్శిటీలో వీసీ నియామకం నుంచి వివాదాలు వెంటాడుతుండగా.. తాజాగా కాంట్రాక్టర్ కు బిల్లులు ఇచ్చేందుకు ఆడిట్ సెక్షన్ అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది.ఆ తరువాత కూడా అదే పరిస్థితులు కొనసాగుతుండటం కూడా కలవరానికి గురి చేస్తోంది. దీంతోనే కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఇక్కడి విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.యూనివర్సిటీ హాస్టళ్లకు పాలు, పెరుగు సప్లై చేసే కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించే విషయంలో ఇక్కడి అధికారులు చేతివాటం చూపారు. పెండెం రాజేందర్ అనే కాంట్రాక్టర్ వర్సిటీలోని నాలుగు హాస్టళ్లకు గతేడాది వరకు పాలు, పెరుగు సరఫరా చేయగా.. ఆయనకు దాదాపు 19 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది.ఆ బిల్లులు చెల్లించడానికి ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య లంచం డిమాండ్ చేశారు. రూ.50 వేలు ఇస్తేనే బిల్లులు క్లియర్ చేస్తానని చెప్పడంతో చివరకు సదరు కాంట్రాక్టర్ కిష్టయ్యను ఏసీబీకి పట్టించారు.చదువులకు నిలయమైన విశ్వవిద్యాలయంలో అవినీతి బాగోతం బయటపడటంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటన జరిగిన మరునాడే మరో వివాదం కేయూ ఆఫీసర్లను చుట్టుముట్టింది. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కోసం క్యాంపస్ లో వివిధ పనులు చేయగా.. దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వడంలోనూ ఆఫీసర్లు కమీషన్లకు ఆశపడ్డారు.ఈ మేరకు కమీషన్లు అందేదాకా బిల్లులు రిలీజ్ చేయకపోవడంతో ఆ కాంట్రాక్ట్ పనులు చేసిన వ్యక్తి మనోవేదనకు గురై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం వీసీ బిల్డింగ్ కు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కాగా కేయూ అధికారులు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే కాంట్రాక్టర్ చనిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.సక్రమంగా పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కాకతీయ యూనివర్సిటీ అధికారులు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రం వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. తాజా ఘటనల్లో ఇద్దరు కాంట్రాక్టర్లు ఆఫీసర్ల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా.. కమీషన్లు ఇస్తున్న కాంట్రాక్టర్లు క్వాలిటీ లేని ఫుడ్, పాలు, పెరుగు సరఫరా చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వర్సిటీలో 2023–24 విద్యాసంవత్సరానికి కిరాణా సామగ్రి, గుడ్లు, అరటి పండ్లు, పాలు, పెరుగు తదితర సరకులు సరఫరా చేసేందుకు 2023 ఆగస్టులో టెండర్లు నిర్వహించగా.. గతంలో సరఫరా చేసిన రాజేందర్ కు కాకుండా ఈసారి వేరే వ్యక్తికి టెండర్ ఇచ్చారు.వర్సిటీ అధికారుల నిబంధనల ప్రకారం నాణ్యమైన విజయ డెయిరీ లేదా ముల్కనూరు డెయిరీకి సంబంధించిన పాలు, పెరుగు మాత్రమే సరఫరా చేయాలి. కానీ ఆ రెండూ కాకుండా తక్కువ రేటు కలిగిన క్వాలిటీ లేని పాలు, పెరుగు సరఫరా చేస్తున్నారని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఇతర కంపెనీలకు చెందిన పాలు, పెరుగు సప్లై చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలోని విద్యార్థులకు క్వాలిటీ లేని ఫుడ్ పెడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటున్న అధికారులు అన్నీ తెలిసీ సైలెంట్ గా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాణ్యతలేని సరుకులు పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *