సిరా న్యూస్,వరంగల్;
సమ్మక్క–సారలమ్మకు భక్తులకు సమర్పించే ఎత్తు బంగారాన్ని గద్దెల వద్దకు సురక్షితంగా చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న కన్వేయర్ బెల్ట్ ప్రతిపాదన మాటలకే పరిమితమైంది. తమ ఎత్తు బంగారం తల్లుల చెంతకు చేరాలనే ఉద్దేశంతో భక్తులు దూరం నుంచే బెల్లం బుట్టాలు గద్దెల మీదకు విసురుతుండగా.. అక్కడున్న సిబ్బంది, మిగతా భక్తులకు దెబ్బలు తగులుతున్నాయి. కొబ్బరికాయలతో తలలు పగిలే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతోనే ప్రభుత్వం కన్వేయర్ బెల్ట్ ప్రతిపాదన తీసుకొచ్చినా కొన్నేళ్లుగా దానికి మోక్షం కలగడం లేదు. ఫలితంగా గద్దెల ప్రాంతంలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎత్తు బెల్లం దెబ్బలు తప్పడం లేదు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.మేడారం జాతర అంటేనే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది తరలివచ్చే మహా పండుగ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది వచ్చిన సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకునే వేడుక. ఇక్కడ అమ్మవార్లకు ఎత్తు బంగారం పేరున బెల్లాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతోనే సమ్మక్క–సారలమ్మకు మొక్కుకున్న మేరకు భక్తులు చాలావరకు తమ బరువుతో సమానంగా బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చిన బెల్లం గద్దెల మీదకు చేరినప్పుడు తమ మొక్కు తీరినట్టుగా భావిస్తుంటారు. ఈ మేరకు తీసుకొచ్చిన ఎత్తు బంగారాన్ని గద్దెల మీద పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కానీ అక్కడ రష్ వల్ల బెల్లం బుట్టాలు సమ్మక్క గద్దెల వద్దకు వెళ్లి పెట్టలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతోనే భక్తులు దూరం నుంచే బెల్లం బుట్టాలు, కొబ్బరికాయలు విసురుతుంటారు. ఇదిలాఉంటే గద్దెల ప్రాంతంలో ఎప్పటికప్పుడు భక్తులు సమర్పించే బెల్లం, ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు, గాజులు, కొబ్బరికాయలను తరలించేందుకు సిబ్బంది పని చేస్తుండగా.. భక్తులు విసిరే బెల్లంతో సిబ్బంది గాయపడిన సందర్భాలు చాలానేఉన్నాయిఎత్తు బంగారాన్ని సమర్పించేందుకు భక్తులు కిలో సైజు నుంచి రూ.25 కిలోల బుట్టాలను కూడా తీసుకొస్తుంటారు. క్యూ లైన్లలో వాటిని తలపై ఎత్తుకుని దర్శనం పూర్తయ్యేంతవరకు మోస్తుంటారు. దీంతో భక్తులు అసౌకర్యానికి గురవడంతో పాటు బరువుతో ఇబ్బందులు తలెత్తేవి. దీంతోనే ఈసారి జాతరకు రూ.80 లక్షలతో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులు తీసుకొచ్చే ఎత్తు బంగారాన్ని కన్వేయర్ బెల్ట్ లో పెడితే అదే నేరుగా బెల్లాన్ని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు చేరుతుందని భావించారు. కానీ అదికాస్త మాటలకే పరిమితమైంది.కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేయకపోవడంతో సమస్య అలాగే కొనసాగుతోంది.