– యుటిఎఫ్
సిరా న్యూస్,బద్వేలు;
పని సర్దుబాటు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న సర్దుబాటు ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని వాటిని వెంటనే సవరించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కోరారు. కడప డిఈఓ కార్యాలయంలోని పరిపాలనాధికారి మునీర్ ఖాన్ ను కలిసి అందుకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ పని సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతున్నదని, జీవో నెంబర్ 117 కానీ జీవో నెంబర్ 53 లను కానీ అనుసరించకుండా జీవోలతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం తగదని తెలిపారు.ఉర్దూ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులందరినీ మిగులు ఉపాధ్యాయులుగా చూపడం సబబు కాదన్నారు. ఒకటి నుండి రెండవ తరగతి వరకు 20 మంది పైబడి విద్యార్థులు ఉన్నప్పటికీ అక్కడ ఒక ఉపాధ్యాయుని మాత్రమే కొనసాగించి మిగిలిన వారిని మిగులు ఉపాధ్యాయులుగా చూపారని, ఏడాది లోపు పదవీ విరమణ పొందుతున్న వారిని కూడా మిగులు ఉపాధ్యాయులుగా చూపారని ప్రత్యేక అవసరాలు మరియు ప్రభుత్వం తెలియ పరిచిన మినహాయింపులు ఉన్నవారిని సైతం సర్దుబాటు ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులుగా చూపారని వీటన్నింటిని సవరించిన తర్వాతే సర్దుబాటు ప్రక్రియ కొనసాగించాలని కోరారు. మిగులుగా ఉన్న జూనియర్ ఉపాధ్యాయుల స్థానంలో ఆసక్తి కలిగిన సీనియర్ ఉపాధ్యాయులను పని సర్దుబాటులో ప్రాధాన్యత పొందుపరచాలని కోరారు.