సిరా న్యూస్,చెన్నై;
తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కల్తీ మద్యం సేవించి 60 మందికిపైగా మృతిచెందారు. ఇలాంటి సంఘటనలు ఇదే మొదటిసారి కాదు. పలు రాష్ట్రాల్లో కల్తీ మద్యం కాటుకు అనేక మంది మృత్యువాతపడ్డారు. అయితే తాజాగా తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం మరణాల నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు మద్యం కల్తీ ఎలా చేస్తారు. ఎవరు చేస్తారు.. ఆల్కహాల్‌లో మిథనాల్ ఎంత ప్రమాదకరం.. పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించే ఈ ప్రాణాంతక మిథనాల్ అక్రమ మద్యం తయారీదారుల చేతికి ఎలా వస్తోంది.. కల్తీ మద్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కల్తీ మద్యం అప్పుడప్పుడు కాటు వేస్తూనే ఉంది. తమిళనాడుతోపాటు గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో కల్తీ మద్యం కాటుకు బలయ్యేవారు ఎక్కువ.కల్తీ మద్యానికి, మత్తు కలిగించే మద్యానికి తేడా ఉంది. ప్రభుత్వ ప్రమాణాల మేరకు కాకుండా ఇష్టానుసారం మద్యం తయారు చేసి వినియోగిస్తే అది కల్తీ అవుతుంది. మత్తు కోసం మిథనాల్ కలిపితే విషపూరిత ఆల్కహాల్‌గా మారుతుంది. ఆల్కహాల్‌లో ఇథనాల్‌గా పిలిచే ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. మిథైల్ ఆల్కహాల్‌ను మిథనాల్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాణాంతకమైన విషపదార్థం. దీనిని పరిశ్రమల్లో కొన్ని రసాయనాల తయారీ కోసం వాడతారు. పరిశ్రమలకు సరఫరా చేసే మిథనాల్‌లో హాల్కహాల్ శాతం 90 నుంచి 100 వరకు ఉంటుంది. ఈ మిథనాల్‌ను డైల్యూట్ చేయకుండా నేరుగా తాగితే నిమిషాల వ్యవధిలోనే మనిషి చనిపోతాడు. ఈ మిథనాల్ పొట్టలో ప్రవేశించగానే పేగుల్లో మంట మొదలవుతుంది. తర్వాత నురగతో వాంతులు అవుతాయి. ఆ వాంతి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఒక్కసారిగా ఊపిరాడకుండా చేస్తుంది. ఈ క్రమంలో మిథనాల్‌లోని విషపదార్థం నాడీ వ్యవస్థకు చేరి మెదడుకు వ్యాపిస్తుంది. దీంతో మెదడు కణాలు చనిపోతాయి. ఫలితంగా అపస్మారక స్థితికి చేరుకుని చనిపోతారు.ప్రాణాంతకమైన ఈ మిథనాల్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కఠిన నిబంధనలు ఉన్నాయి. కేవలం పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించే మిథనాల్ కొనుగోలు నుంచి వినియోగం వరకూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అనేక వ్యవస్థలు కూడా ఉన్నాయి. మిథనాల్ వినియోగానికి ఫ్యాక్టరీలు కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయినా మిథనాల్ అక్రమ మద్యం తయారీదారుల చేతికి చేరుతోంది. ఫ్యాక్టరీల యజమానులతో మాట్లాడుకుని మిథనాల్‌ను కల్తీ మద్యం తయారీ కోసం తీసుకెళ్తున్నారు. ఫ్యాక్టరీల యజమానులు కూడా మిథనాల్‌ను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో కల్తీ మద్యం వ్యాపారులు కల్తీ మద్యం తయారు చేసి పేదలు, కూలీలతో తాగిస్తున్నారు.మిథనాల్ విక్రయానికి ఆంక్షలు ఉన్నాయి. మిథనాల్ కొనుగోలు చేసేందుకు లైసెన్స్ ఉండాలి. కొనుగోలు చేసిన మిథనాల్‌ను ఎలా ఉపయోగించారు? ఎంత వినియోగించారు? ఇంకా ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలతో ఫ్యాక్టరీలు రికార్డులను నిర్వహించాలి. ఇన్ని ఆంక్షలు, నిబంధనలు ఉన్నా ఫ్యాక్టరీల యజమానులు డబ్బుల కోసం మిథనాల్‌ను అక్రమార్కులకు విక్రయిస్తున్నారు. దీని ఫలితంగానే కల్తీ మద్యం తయారవుతోంది. పేదల ప్రాణాలు తీస్తోంది.
==================