సిరా న్యూస్, ఆదిలాబాద్:
పకడ్బందీగా ప్రజాపాలన ఆన్‌లైన్…
+ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
+ వెబ్‌సైట్‌లో నమోదుపై ఆపరేటర్లకు శిక్షణ
+ ఈ నెల 17 లోగా పూర్తి చేయాలని ఆదేశం
+ ఆన్‌లైన్‌లో చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
ప్రజాపాలనలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా, పకడ్బందీగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డాటా నమోదుపై పలు సూచనలు అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులో ఉన్న విధంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. వెబ్‌సైట్‌లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ నెల 6తో దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయినందున ఈ నెల 17లోగా ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్క దరఖాస్తు కూడ గల్లంతు కాకుండా జాగ్రతగా ఆన్‌లైన్ చేయాలని, నిర్లక్ష్యంగా పనిచేస్తే ఆపరేటర్‌తో పాటు సంబందిత అధికారులపై కూడ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ డాటా ఆధారంగానే లబ్దిదారులకు వివిద సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందని, లబ్దిదారుల ఆధార్, రేషన్ కార్డ్, సెల్‌ఫోన్ నంబర్లు జాగ్రతగా నమోదు చేయాలన్నారు. అంతకు ముందు మాస్టర్ ట్రైనర్ వినోద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వార డాటా ఎంట్రీ ప్రక్రియను ఆపరేటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, డీపీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో గణపతి, మున్సిపల్ కమీషనర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.