సిరా న్యూస్, నేరేడుచర్ల:
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం… ఆసుపత్రిలో యువకుడు…
– నిబంధనలు పాటించని కాంట్రాక్టర్, అధికారులు
– కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టని వైనం
– రాత్రి పూట బైక్ పై వస్తూ గుంతలో పడిన యువకుడు
– తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక
– యువకుడికి తీవ్ర గాయాలు యువకుడికి తీవ్ర గాయాలు
-కాంట్రాక్టర్ పై కేసు నమోదుకు స్థానికుల డిమాండ్
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం వద్ద ప్రధాన రహదారిపై, డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్విన పెద్ద గుంతలో పడి స్థానిక యువకుడు సింగ్ చైతన్య కుమార్ తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం…సింగ్ చైతన్య కుమార్ అనే యువకుడు ఆదివారం వ్యవసాయ పనులు ముగించుకొని రామాపురం రోడ్డు గుండా రాత్రి సుమారు 8 గంటలకు ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నేరేడుచర్ల లోని రామాపురం ప్రధాన రహదారిపై తవ్విన గుంత చీకట్లో కనిపించకపోవడంతో, ఒక్కసారిగా బైక్ తో సహా గుంతలో పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అతన్ని 108 లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో 16 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. కుడి భుజం సైతం విరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ నిబంధనలు పాటించకుండా, ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా ప్రధాన రహదారిపై గుంతలు తీయడంతోనే యువకుడికి ప్రమాదం జరిగిందని అతని తల్లిదండ్రులు బంధువులు వాపోతున్నారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని యువకుడి తల్లిదండ్రులు నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఇష్టానుసారంగా గుంతలు తీసి, హెచ్చరిక బోర్డులు సైతం పెట్టకుండా ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.