సిరా న్యూస్, బేల:
బేలలో శాశ్వత డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి..
బేల మండలంలోని డిగ్రీ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాకతీయ యూనివర్సిటీ అధికారులు వెంటనే బేల మండలంలో శాశ్వత డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ డిమాండ్ చేశారు. సోమవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 20 నుండి డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమౌతున్న నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్ కు తరలించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. బేలలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని తొలగించడం ఖచ్చితంగా అనాలోచితమైన నిర్ణయమేనని, దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ లేదని అన్నారు. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, బేల నుండి ఆదిలాబాద్ కు వెళ్లేందుకు ఉన్న జాతీయ రహదారిపై తర్నం వద్ద బ్రిడ్జి కుంగిపోవడం, సరైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు కేంద్రాన్ని మార్చాలని కోరారు. బేలలో దాదాపు 500 మంది డిగ్రీ విద్యార్థులు ఉంటారని వీరందరి కోసం బేలలోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రీతం, నవనీత్, సాయి, సూరజ్, జిత్తు, జతిన్, వంశి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.