వివాదాలు…కేసులు. అనుముల రాజకీయ ప్రస్థానం

సిరా న్యూస్,మహబూబ్ నగర్;
టైగర్ అని దగ్గరివాళ్లు ప్రేమగా పిలుచుకునే అనుముల రేవంత్ రెడ్డి రాజకీయాలూ అంతే. దూకుడైన స్వభావం.. పదునైన మాటలతో రాజకీయరంగంలోకి దూసుకొచ్చిన నేటితరం నేత రేవంత్ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో వేగంగా ఎదిగిన నేతగా ఆయన. ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుడిగా ఉన్న కేసీఆర్ ను దూకుడుగా ఎదుర్కొన్న నేత రేవంత్ రెడ్డి. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది.రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం విద్యార్థి నేతగా ప్రారంభమైంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పటికీ తెలంగాణలోని బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. విద్యార్థి జీవితంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2001-2002 మధ్య కాలంలో టీఆర్ఎస్‌లో పని చేశారు. 2004లో కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించినా ఆయనకు నిరాశే ఎదురైంది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఎన్నికల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2007లోను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డిలోని చురుకుదనం చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్… కాంగ్రెస్ నుంచి అప్పటికే ఐదుసార్లు గెలిచిన గుర్నాథరెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి టీడీపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, మారిన రాజకీయ పరిణామాల వల్ల క్రమంగా టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోయే పరిస్థితులు ఏర్పడటంతో మరోసారి ఆ పార్టీని వదిలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.2017 అక్టోబర్ 31న కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. 2018 ఎన్నికల్లో కొండంగల్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చాక రేవంత్ రెడ్డికి ఇది తొలి ఓటమిగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *