జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆసుపత్రులలో కొనసాగుతున్న వైద్య సేవల గురించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మారుమూల మండలాలైన పలిమెల, మహ ముత్తారం, కాటారం మండలాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.
మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. మాతా శిశు మరణాలు, చిన్నపిల్లల్లో వచ్చే రక్తహీనత సమస్యలు, టీబి, అంటు వ్యాధుల నిర్మూలన కార్యక్రమాలు జరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.ఆయుష్మాన్ ఆరోగ్యం, జాతీయ ప్రమాణాల ఆరోగ్య నివేదిక గురించి సమీక్షించారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరియైన సదుపాయాలు లేని వాటికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబటిపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నానని తెలియజేశారు. అలాగే ఎక్కడైతే జాతీయ ప్రమాణాల నివేదికకు ఎంపిక కాబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సదుపాయాల కల్పనకు కొరకు నిధులు మంజూరు చేస్తామన్నారు. రాబోయే మూడు నెలల వర్షాకాలం సీజన్లో వైద్యాధికారులకు వాహన అలవెన్స్ ఇస్తామని, అలాగే వర్షాకాలంలో అన్ని గ్రామాలలో క్షేత్ర పరిశీలన కొరకు ఏఎన్ఎం లకు మరియు అంగన్వాడీ సూపర్వైజర్స్ కు మెడికల్ ఆఫీసర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
మాత శిశు సంరక్షణలో భాగంగా లింగ నిష్పత్తి తేడా ఉన్నందున మెడికల్ ఆఫీసర్లు అందరినీ వాటి పై సమీక్ష చేయాల్సిందిగా ఆదేశించారు.
వర్షాకాలంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు, అత్యవసరమందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్
మధుసూదన్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కొమురయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజుడేవిడ్, చిట్యాల సూపరిన్టెండెంట్, డాక్టర్ తిరుపతి, ప్రోగ్రాం అధికారులు, ప్రాధమిక ఆరోగ్య వైద్యాధికారులు, మల్టి పర్పస్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.