Double Launch- Schemes Unveiled, Twice!: పథకాలు అవే.. ప్రారంభోత్సవం మాత్రం రెండు సార్లు..

సిర్యా న్యూస్, ఆదిలాబాద్‌:

పథకాలు అవే.. ప్రారంభోత్సవం మాత్రం రెండు సార్లు..

+ శనివారం మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ పథకాలను ప్రారంభించిన కలెక్టర్‌
+ రెండో రోజు మరల ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌
+ ‘పాయల్‌ వర్సెస్‌ ప్రభుత్వం’ మొదలైందని అంటున్న విశ్లేషకులు
+ పాయల్‌ ఆల్వేస్‌ పవర్‌ఫుల్‌… అంటున్న పార్టీ శ్రేణులు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ పథకాలను రెండు సార్లు ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్, ఇతర అధికారులు, నాయకులతో కలిసి ఆదిలాబాద్‌ పట్టణంలోని రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించడంతో పాటు ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మీ పథకాన్ని సైతం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాయల్‌ శంకర్‌ ఆదివారం అధికారులు, నాయకులతో కలిసి మరల మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిమ్స్‌ డైరెక్టర్‌ రాథోడ్‌ జైసింగ్, జిల్లా వైద్యాధికారి రాథోడ్‌ నరేందర్, ఆర్టీసీ ఆర్‌ఎం సోలేమాన్, డీఎం కల్పన, మున్సిపల్‌ కమీషనర్‌ శైలజా.. ఇలా జిల్లా స్థాయి అధికారులంత హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ మాత్రం హాజరుకాపోవడంతో, అసలేం ఏం జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఆదివారం కావడంతోనే కలెక్టర్‌ ఈ కార్యక్రమానికి రాలేదని కొంత మంది చెబుతున్నప్పటికీ, ఇతర జిల్లా స్థాయి అధికారులు హాజరై, ఒక్క కలెక్టర్‌ మాత్రమే రాకపోవడంతో ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

పాయల్‌ వర్సెస్‌ ప్రభుత్వం..

అవే పథకాలను రెండు సార్లు ప్రారంభించిన విషయంలో ప్రజలు భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. కొంత మంది రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వం ఉంది కాబట్టి, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ లేకుండానే ఈ పథకాలను కలెక్టర్‌ ప్రారంభించారని అనుకుంటున్నారు, మరికొంత మంది మాత్రం స్థానిక ఎమ్మెల్యే హైదరబాద్‌లో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఉండటంతో, ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్‌ శనివారం ప్రారంభించాల్సి వచ్చిందని, అంతేతప్ప ఇంకా ఏమి లేదని చర్చించుకుంటున్నారు. ఈ అంశం ఎలా ఉన్నప్పటికీ ఇక మీదట మాత్రం ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో ‘పాయల్‌ శంకర్‌ వర్సస్‌ కాంగ్రేస్‌ ప్రభుత్వం’ అన్నట్లుగానే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏదైన విషయంలో తేడా వస్తే… కలెక్టర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటారా? లేదంటే స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఆదేశాలు పాటిస్తారా? అనేది అసక్తిగా మారింది. రాష్ట్రంలో కాంగ్రేస్‌ అధికారంలో ఉండటం, తాను బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో పాయల్‌ శంకర్‌కు కొంచెం ఇబ్బంది తప్పదని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

పాయల్‌ ఆల్వేస్‌ పవర్‌ఫుల్‌…

గత 20ఏండ్లుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ ప్రజల మద్యనే ఉన్న డేర్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ పాయల్‌ శంకర్‌ అని బీజేపీ శ్రేణులు, అభిమానులు చెబుతున్నారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌కు అన్ని శాఖల అంశాలు, అధికారుల విధులు, ప్రభుత్వ నిధులపై స్పష్టమైన అవగాహణ ఉందని వారు చెబుతున్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహణ, ప్రజల మద్య కలిసిపోయే గుణం ఆయనకు ఉందని చెబుతున్నారు. 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన తన మనోధైర్యాన్ని కోల్పోలేదని, ఇప్పడు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాడని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా తన మార్క్‌ అభివృద్ధి త్వరలో ఆదిలాబాద్‌ ప్రజలు చూస్తారని, ఇక పాయల్‌కు తిరుగు లేదని వారు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *