సిరా న్యూస్,భీమదేవరపల్లి
యువతను పొగాకు నుంచి కాపాడాలి: డాక్టర్ రహమన్
* వంగరలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
యువతను పొగాకు నుంచి కాపాడాలని డాక్టర్ రహమన్ అన్నారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వంగర పోలీసుల ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా పొగాకు వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జీవితంలో ఎప్పుడు పొగాకు, ఇతర పొగాకు ఉత్పత్తులు వాడమని, పర్యావరణాన్ని పోగాకు ఉత్పత్తుల వినియోగము నుండి రక్షించుటకు ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను పిల్లలకు విద్యార్థి దశ నుండే తెలియజేయాలని అన్నారు. ధూమపానం మనిషి జీవితాన్ని హరించి వేస్తుందని పొగ తాగిన చాలా మంది ఆనారోగ్యం బారినపడి క్యాన్సర్ తదితర రోగాలతో మృత్యువాత పడుతున్నారన్నారు. గుట్కా మనిషిని పీల్చి పిప్పిచేస్తుందని, గుట్కా తినడం మానవాళికి జరిగే నష్టం ఎక్కవ అని వివరించారు. పొగాకులోని విష పదార్థాలు మనిషి తల వెంట్రుకల నుంచి కాలిగోళ్ళ వరకు అన్ని అవయవాలలో విపరీత ప్రభావం చూపించి మనిషిని చంపేస్తుందన్నారు. నేరుగా పీల్చే పొగ కంటే పొగాకు పీల్చిన వారి ఊపిరితిత్తులలోకి చొచ్చుకు పోయి ఎక్కవ హని కలిస్తాయని తెలిపారు. దగ్గు, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు, ఆస్తామా, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుందని అన్నారు. తరుచు ఇన్ఫెక్షన్లు, అనేక రకాల క్యాన్సర్లకు పొగాకు ఉత్పత్తుల కారణమవుతాయని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. రూబినా, డా. రహమన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది కెఎల్ఎన్ స్వామి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.