సిరా న్యూస్, బేల:
కొత్త చట్టంపై బేలలో డ్రైవర్ల ఆందోళన…
+ అంతర్రాష్ట్రీయ రహదారిపై బైఠాయింపు
+ నిబంధనల ఉపసంహరణకు డిమాండ్
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ లో కొత్త చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పలువురు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంతరాష్ట్రియ రహదారిపై బైఠాయించారు. ఆనంతరం పలువురు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న భారతీయ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విదించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని అన్నారు. ఈ కొత్త నిబంధనలు డ్రైవర్ల పాలిట శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని పనిగట్టుకుని ఎవరు కూడా ప్రమాదాలు చేయరని దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఎందరినో ఆసుపత్రులకు తరలించిన తమపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఈ నిబంధన వలన యావత్ డ్రైవర్ జాతి భయభ్రాంతులకు లోనవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.