సిరాన్యూస్, ఆదిలాబాద్:
నంబర్ ప్లేట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు: డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి
* 321 వాహనాల సీజ్
* వాహనానికి ముందు, వెనకాల నంబర్ ప్లేట్ తప్పనిసరి
* వారం రోజులుగా పట్టణంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
నంబర్ ప్లేట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాలను ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం 50 నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. వారం రోజులుగా ఇప్పటివరకు 321 వాహనాలను గుర్తించి వారి వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేసి, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు ఆధారంగా నంబర్ ప్లేట్లను దగ్గరుండి ఏర్పాటు చేసి, నంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానా విధించి విడిచి పెట్టడం జరిగిందని తెలిపారు. తరచూ కావాలనే నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనదారుల పట్ల వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుం దన్నారు. అదేవిధంగా నంబర్ ప్లేట్‌లో వాహనం యొక్క నంబర్ ఓకే పరిమాణంలో ఉండాలని ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడిన నంబర్ ప్లేట్లను వాడాలని సూచించారు. ఎవరైనా కావాలని ఒక నెంబర్‌కు బదులుగా ఇంకొక నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లయితే వాహనాన్ని సీజ్ చేసి, వారిపై చీటింగ్ ఫోర్జరీ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ స్పెషల్ ఆపరేషన్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్, వారి సిబ్బంది పాల్గొన్నారు.