వినుకొండలో లెదర్ పార్కు ఏర్పాటుకు భూములు కేటాయిస్తం
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
సిరా న్యూస్,వినుకొండ;
ప్రస్తుతమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దళితులకు సముచిత గౌరవం, అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అవకాశాలతో పాటు దళిత, బహుజన ఉద్యమాలకు కొండంత అండగా పార్టీ నిలిచిందన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు పట్టణానికి వచ్చిన లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావును తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన ఘనంగా సన్మానించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నాయకులకు ఎమ్మెల్యే జీవీ, పిల్లి మాణిక్యరావు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా అనేక పోరాటాలు, ఉద్యమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మాణిక్యరావు అని కొనియాడారు. ఎమ్మార్పీఎస్లో వివిధ హోదాల్లో పనిచేశాక తెలుగుదేశం సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరారన్నారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహించారని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలు అందించారని ప్రశంసించారు. అందుకే ఎంతో నిబద్ధతతో పార్టీకి పిల్లి మాణిక్యరావు అందించిన సేవలను గుర్తించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్గా అవకాశం ఇచ్చారన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ను భవిష్యత్తులో ఉన్నత స్థితికి తీసుకెళ్తారని, సీఎం చంద్రబాబుతో మాట్లాడే చొరవ ఉన్న వ్యక్తిగా, నిధులు తీసుకొచ్చి తప్పనిసరిగా వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే వినుకొండలో లెదర్ పార్కు ఏర్పాటుకు భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని జీవి ఆంజనేయులు అన్నారు. నిధులు తీసుకొస్తే ఎన్ని ఎకరాలు కావాలన్నా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విలెదర్ ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పిల్లి మాణిక్యరావుకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. తర్వాత మాట్లాడిన లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా నేతలంతా తనను ప్రేమ, గౌరవంతో ముందుకు నడిపించారన్నారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనకు లిడ్ క్యాప్ ఛైర్మన్గా అవకాశం కల్పించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అయిదేళ్ల వైకాపా పాలనలో లిడ్ క్యాప్ మూలనపడిపోయి ఉందని, ఆస్తులను అన్యాక్రాంతం చేశారని, జగన్రెడ్డి భూములన్నీ లాక్కుకున్నారని, ఎక్కడా ఒక్క పరిశ్రమ పెట్టలేదని, ఎవరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి లేకుండా చేశారన్నారు. దీని మీద మొత్తం వివరాలు వెలికితీసి ఆ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎవరు లాక్కుకున్నారు. వాటిని మళ్లీ ఏవిధంగా వెనక్కి తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావడానికి ఎవరితో మాట్లాడాలో అధ్యయనం చేశామన్నారు. తిరుపతి సమీపంలో అవంతి లెదర్ పరిశ్రమ ఉందని, దాన్ని తెనాలికి చెందిన వ్యక్తి నెలకొల్పారని, లెదర్ పరిశ్రమపై ఆయన రూ.10 వేల కోట్ల టర్నోవర్తో నడుపుతున్నారని, ఇటీవలే ఆయన దగ్గరికి వెళ్లి లెదర్ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించడం జరిగిందన్నారు. విజయవాడలో పెద్ద లెదర్ కాంప్లెక్స్ నిర్మాణానికీ ప్రయత్నం చేస్తు న్నామన్నారు. తెలుగుదేశం పార్టీలో స్వాతంత్ర్యం, స్వేచ్ఛతో పాటు అన్నీ ఉంటాయని, కష్టపడే ప్రతిఒక్కరికీ కూడా అవకాశాలు వస్తాయన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీని సమర్ధంగా నడిపించిన శక్తి సామర్థ్యాలు జీవీ ఆంజనేయులుకు ఉన్నాయని, ప్రతి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల గురించి చంద్రబాబుతో మాట్లాడేవారన్నారు. జిల్లాలో తనలాంటి ఎంతోమంది నాయకుల్ని ఆయన తయారు చేశారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓటమి భయంతోనే బహిష్కరిస్తున్నట్లుగా నాటకం ఆడుతూ, వేరేవాళ్లను ప్రోత్సహించే పద్ధతి చేస్తున్నారని మండిపడ్డారు. ఓటరు నమోదు, ప్రచారంలో ఏమాత్రం అలసత్వం లేకుండా వారి కుట్రలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సూచించారు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు జీవీ ఆంజనేయులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.