సిరా న్యూస్,తిరుపతి;
ఎడిఫై స్కూల్స్ కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ క్రింద జనతా సోసైటీ వారికి మార్చురీ అంబులెన్స్ వాహనాన్ని వితరణగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరులో గల ఎడిఫై స్కూల్ వారు జనతా సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు మార్చురీ అంబులెన్స్ వాహనాన్ని వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన పేదవారి శవాలను వారి సొంత గ్రామానికి తరలించడానికి అంబులెన్స్ వారు అధిక ధరలు వసూలు చేశారని గుర్తు చేశారు. చాలామంది పేదవారు డబ్బులు లేక బాధపడటం చూసి సమాజానికి నా వంతుగా మేలు చేయాలని తలంపుతో మార్చురీ అంబులెన్స్ వాహనాన్ని జనతా సొసైటీ వారికి వితరణగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎమరాల్డ్స్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.మునిరత్నం మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ఎడిఫై స్కూల్ వారితో కలిసి మార్చురి అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ వాహనం తిరుపతి పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉంటుందని 35 కిలోమీటర్లు వరకు అందుబాటులో ఉంటుందని అన్నారు. మార్చురీ అంబులెన్స్ వాహన సేవలు ఉపయోగించుకోవాలంటే 98765 41085 నెంబర్ కు ఫోన్ చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో ఎడిఫై స్కూల్ పి.ఆర్.ఓ రాజేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, నారాయణ స్కూల్స్ డీజీఎం,కొండలరావు ఎడిఫై స్కూల్ సిబ్బంది జనతా సోసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.