ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేయాలి

-ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి యుటిఎఫ్ వినతి

సిరా న్యూస్,బద్వేలు;

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు తగు సహకారం అందించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి యుటిఎఫ్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కలిసి విద్యారంగ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, వైసిపి ప్రభుత్వం విద్యారంగం పట్ల అవలంభించిన విధానాల వల్ల ప్రభుత్వ విద్యా రంగంలో సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఆనాలోచిత చర్యలు, అసంబద్ధ విధానాలు ప్రభుత్వ విద్యా రంగాన్ని తిరోగమనం వైపు నడిపించాయని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటుపడతామని, ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తున్న జీవో 117 ను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సహకారం అందించారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల, పట్టభద్రుల ప్రతినిధిగా విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని ఎమ్మెల్సీకి వారు విజ్ఞప్తి చేశారు. నూతన జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక విద్యను నీర్వీర్యం చేసిన జీవో నెం.117 ను తక్షణం రద్దు చేయాలని, 1-5 తరగతులను ప్రాథమిక విద్య పరిధిలో, 6-10 తరగతులను మరియు 6-12 తరగతులను సెకండరీ స్థాయి విద్య పరిధిలో నిర్వహించాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని, విద్యార్థి, తల్లిదండ్రుల అభీష్టం మేరకు మాధ్యమాన్ని ఎంపిక చేసుకొని చదువుకునే అవకాశాన్ని కల్పించాలని, ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలలో భాగస్వాములను చేసే చర్యలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. నాడు-నేడు కార్యక్రమం బాధ్యతల నుండి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను తప్పించాలని, నూతన మెగా డీఎస్సీ ని నిర్వహించి, నియామకాలు చేపట్టే లోపే ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టి, బదిలీలు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని. సిపిఎస్, జిపిఎస్ విధానాలను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.12వ పిఆర్సీని అమలు చేయాలని, పిఆర్సీ అమలు అయ్యేవరకు మధ్యంతర భృతిని చెల్లించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ప్రత్యేకించి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటుపడుతుందని పేర్కొన్నారు. యుటిఎఫ్ ప్రస్తావించిన సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు వై.రవి కుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, చెరుకూరి శ్రీనివాసులు, ఎస్.ఎజాస్ అహమ్మద్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.ప్రభాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.రూతు ఆరోగ్య మేరి, నాయకులు ఎస్.అనిల్ కుమార్,ఎం.లక్ష్మీ దేవమ్మ, ఎస్.ఎం. భాష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *