దర్శిలో మారిపోయిన సమీకరణాలు

 సిరా న్యూస్,ఒంగోలు;
ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే గొట్టిపాటి ఫ్యామిలీకి చెందిన గొట్టిపాటి భరత్ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. వైసీపీ టికెట్‌తో పర్చూరు నుంచి ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన భరత్.. తర్వాత టికెట్ దక్కకపోయినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అలాంటాయన ఇప్పుడు సడన్‌గా జగన్‌కి సారీ చెప్పి ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. దర్శి టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న తన అక్క గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా ప్రచారం చేస్తానంటున్నారు. భరత్ నిర్ణయం మూడు సెగ్మెంట్లలో వైసీపీకి నెగిటివ్‌గా మారే అవకాశం ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ నేత గొట్టిపాటి భరత్ వైసిపికి షాక్ ఇచ్చారు. తన సోదరి దర్శి టిడిపి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి భరత్ తన మద్దతు ప్రకటించారు. సొంత అక్క అయిన లక్ష్మి కోసం అనివార్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇప్పటివరకు తనకు అండగా నిలిచిన, పర్చూరు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వైసీపీకి గుడ్‌బై చెప్పిన భరత్ దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ నామినేషన్ కార్యక్రమానికి హాజరై అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు.ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో గొట్టిపాటి కుటుంబానిది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఆ కుటుంబ పెద్ద గొట్టిపాటి హనుమంతరావు టీడీపీలో జడ్పీ చైర్మన్‌గా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు గొట్టిపాటి నరసయ్య మార్టురు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత హనుమంతరావు తమ్ముడి కొడుకు గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నాలుగో సారి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈ సారిగొట్టిపాటి రవి చొరవతోనే గొట్టిపాటి నరసయ్య కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి టీడీపీ అభ్యర్ధిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.గొట్టిపాటి భరత్ కూడా మాజీ ఎమ్మెల్యే నరసయ్య కుమారుడే వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తూ వస్తున్న భరత్ 2014 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే ఆఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గ టికెట్ మరోసారి ఆశించినప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాలు నేపథ్యంలో గొట్టిపాటి భరత్‌ను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్ కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయి వైసీపీకి దూరమయ్యారు.దాంతో పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను మరోసారి వైసీపీ అధిష్టానం భరత్ కు కేటాయించింది. తర్వాతఇంచార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా భరత్‌ను పక్కన పెట్టి పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను రావి రామనాథంబాబుకు వైసీపీ అధిష్టానం కేటాయించింది. అప్పటి నుంచే వైసిపి అధిష్టానం తీరుపై భరత్ అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పర్చూరు వైసీపీ టికెట్ తనకే దక్కుతుందని భరత్ భావించారంట. అయితే అనూహ్యంగా కాపు సామాజికవర్గనికి చెందిన యడం బాలాజీకి పర్చూరు వైసీపీ టికెట్ దక్కింది. పార్టీలో వరుసగా తనకు అవమానాలు ఎదురు కావడాన్ని భరత్ జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న తనకు సరైన గౌరవం దక్కలేదనే అభిప్రాయంతో గొట్టిపాటి భరత్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణాల చేతనే భరత్ వైసిపిని వీడినట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.తన అక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దర్శిలో గెలిపించడానికి వైసీపీ నుంచి బయటకు వచ్చానంటున్న భరత్ తన రాజీనామా లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పర్చూరులో తన విజయం కోసం కుటుంబ ఆస్తి అయిన పొలం అమ్మినా తన అక్క లక్ష్మి ఎందుకు అని ఒక్క మాట కూడా అడగలేదని.. వెంటనే సంతకం పెట్టిందని ఇల్లు, వాకిలి తాకట్టు పెట్టినా ఏనాడూ ప్రశ్నించలేదని భరత్ చెప్పుకొచ్చారు. పర్చూరు కార్యకర్తలు ఎవరు వెళ్లినా నామమాత్రపు ఫీజు తీసుకొని వైద్యం చేసేవారని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సేవలందించారని వివరించారు.ఇంతవరకు తనను ఏమీ అడగని తన సోదరి ఈ ఎన్నికల్లో తోడుగా నిలబడమని అడిగారని అది ధర్మంగా భావించి దర్శికి వెళుతున్నట్లు భరత్ పేర్కొన్నారు. జగన్ తనను క్షమించాలని, తనపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపించారని, కాకపోతే ధర్మం కోసం అక్కకు తోడుగా నిలబడుతున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడు గొట్టిపాటి భరత్ తండ్రి మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వం కొనసాగిస్తున్నారు. వైసీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన భరత్ ఇప్పుడు టీడీపీకి మద్దతు పలకడం పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు ప్లస్ అవుతుందన్నఅభిప్రాయం వ్యక్తం అవుతుందిపర్చూరు నియోజకవర్గంలో భరత్‌ సొంత మండలం యద్దనపూడిలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడా ఓట్ బ్యాంక్ ఈసారి ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అద్దంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో ఉండడం. దీంతో పాటు భరత్ సోదరి గొట్టిపాటి లక్ష్మి దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండడంతోపాటు తాజాగా గొట్టిపాటి భరత్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి, అద్దంకి ,పర్చూరు నియోజకవర్గల్లో తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
==========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *