హైడ్రా లాంటి సంస్థలతోనే విపత్తుకు విముక్తి

సిరా న్యూస్;

వానలు, వరదలు వచ్చి ఎక్కడికక్కడ మునిగిపోతున్నాయి. కారణం ఒక్కటే… నీటి పారుదల వ్యవస్థలు దెబ్బతినడమే. దాదాపు 25 లక్షల గృహాలున్న హైదరాబాద్ నగరంలో నిజాం కాలం నుండి కొన్ని వేల నీటి కుంటలు, చెరువులు, సరస్సులు, నాలాలు ఉండేవి. అనేక తోటలతో అందమైన నగరంగా విలసిల్లింది. కానీ వాటిలో 60-70 శాతం అక్రమంగా ఆక్రమించి పెద్ద భవనాలు, పరిశ్రమలు, నివాస గృహాలు, ఫామ్ హౌస్‌లు, అపార్ట్ మెంట్లు, ఫార్మా సిటీలు నిర్మించారు అక్రమదారులు..భాగ్యనగరంలో వర్షాకాలం వస్తే చాలు నీరు ఉప్పొంగి రోడ్లను, గృహ సముదాయాలను వరద ముంచెత్తుతోంది. దీంతో నీటి వనరుల పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం “హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్” (హైడ్రా)ను ఏర్పాటు చేసింది. నిబంధనలను ఉల్లంఘించి, చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేపడితే తప్పకుండా వాటిని కూల్చి వేయవలసిందే. దీనికి సామాన్య ప్రజల నుండి హృదయ పూర్వకంగా అభినందనలు ప్రభుత్వానికి వస్తున్నాయి.హైదరాబాద్ భాగ్యనగరంగా ప్రసిద్ధి. నిజాం రాజ్యానికి రాజధాని. 500 సంవత్సరాల పైబడిన పురాతన చారిత్రక నగరం. ఈ నగరం ఇప్పుడు సురక్షత, ఆవాసయోగ్యమైన, విశ్వనగరంగా విఖ్యాతి గాంచింది. ఈ మహానగరంలో ఒక్క తెలుగు వారే కాక దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. చిరు వ్యాపారం చేసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కోటికి పైగా జనాభా వున్న రాజధానిలో ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా సుమారు 1 లక్షా 50 వేల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. వీరందరికి తగినంతగా తాగునీరు, ఇతర అవసరాలకు సరిపడా నీటి వసతి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, తర్వాత తెలంగాణను వరుసగా పాలించిన ప్రభుత్వాలు.. చెరువులపై అక్రమ నిర్మాణాలకు అలవోకగా అనుమతులిచ్చేశాయి. దీంతో వర్షాకాలంలో నీరు సహజంగా ప్రవహించి చెరువులలోకి చేరకుండా ఈ అక్రమ కట్టడాలు అడ్డుకుంటున్నాయి. దీంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజా జీవితం దుర్భర మౌతుంది.నీటి వనరుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పరచిన హైడ్రా ఉద్ధేశం చాలా మంచిది. నిబంధనలను ఉల్లంఘించి, చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేపడితే తప్పకుండా వాటిని కూల్చి వేయవలసిందే. అందుకే ప్రభుత్వానికి సామాన్య ప్రజల నుండి హృదయ పూర్వకంగా అభినందనలు వస్తున్నాయి. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రజల ఆస్తుల పరిరక్షణ ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరుల పరిరక్షణ అవసరం. అయితే హైడ్రా పనితీరుపై కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ హైడ్రా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.అయితే ఈ ప్రక్రియ ఆరంభ శూరత్వం కాకూడదు. ఇకముందు అక్రమ కట్టడాలు లేకుండా ప్రభుత్వ ఆస్తులకు కంచెలు వేయాలి. సైన్ బోర్డులు తగిలించాలి. నిష్పాక్షికంగా, పారదర్శకంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా హైడ్రా చట్టబద్ధంగా పనిచేయాలి. అది నిరూపించడం కోసం మొదట కాంగ్రెస్ నాయకుల ఆక్రమణలపై కూల్చివేతలు ప్రారంభించి, విపక్షాల అక్రమ కట్టడాల జోలికి వెళ్లాలి. ప్రభుత్వం తనవారు, పరాయివారు అనే పక్షపాతం ఎట్టి పరిస్థితుల్లో చూపరాదు. చెరువులు, కుంటలు, ఇతర సహజ వసరుల రక్షణ చేపట్టాలి. ధనికులకు, పారిశ్రామిక వేత్తలకు, సినీ సెలబ్రిటీలకు అనుచిత మర్యాదలు చూపి చట్ట వ్యతిరేక చర్యలకు మద్దతు ఇవ్వరాదు. రాగ ద్వేషాలకు, రాజకీయ కక్ష సాధింపులకు హైడ్రాను వాడరాదు. స్వపక్షం, విపక్ష హోదాలకు అతీతంగా హైడ్రా పనిచేయాలి.అయితే, ఇప్పటికే అక్రమ కట్టడాలలో ఇళ్లు కొనుక్కున్న వారికి బిల్డర్స్ ఆస్తులను జప్తు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. పేదవారి ఇళ్లను కూల్చినప్పుడు వారికి వెంటనే ప్రభుత్వ భూమి ఇవ్వాలి. లేదా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. లేదా తగిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. బిల్డర్లతో కుమ్ముక్కై ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు, లేఅవుట్ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. వారి ఆస్తులు జప్తు చేసి, జైలుకు పంపాలి. చెరువులపై కట్టిన కట్టడాలను కూల్చినప్పుడు కట్టడాల వ్యర్థాలను తీసివేసి చుట్టూ కంచె వేసి, పరిసర కాలనీ వాసులకు చెరువుల పరిరక్షణా బాధ్యతలను అప్పగించాలి. ప్రతి జిల్లాలోనూ హైడ్రా వంటి సంస్థలను ఏర్పాటు చేయాలి. చెరువులు, కుంటలు, నాలాలు చెక్ డ్యాముల పరిరక్షణకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి వారికి బాధ్యత, అధికారాలు అప్పగించాలి. ప్రభుత్వ చిత్తశుద్ధే హైడ్రా విజయానికి ఆధారమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *