– పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
సిరా న్యూస్,మంథని;
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దంగా ఉన్నామని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగిరి మండలంలోని జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా, అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, మంథని, పెద్దపల్లి రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రామగిరిలోని జేఎన్టీయూ మంథని కళాశాలలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ల ఈవిఎం యంత్రాల కౌంటింగ్, 7 అసెంబ్లీ సెగ్మెంట్ లలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4న పకడ్బందీగా నిర్వహించేందుకుఅవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశామని, ప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, కౌంటింగ్ విధులు నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద 81 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక గ్రూప్ డీ ఉద్యోగి సిబ్బంది బృందంగా ఏర్పాటు చేశామని, ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద అవసరానికి మించి అదనపు బృందాలను సిద్ధంగా ఉంచి, కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని కలెక్టర్ పేర్కొన్నారు.
పెద్దపల్లి, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ లలో 21 రౌండ్ల కౌంటింగ్, ధర్మపురి, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లలో 19 రౌండ్ల కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జూన 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం మంథని జేఎన్టీయూ కళాశాలలో ప్రత్యేక కౌంటింగ్ హాల్ లో 26 టేబుల్ లతో 154 సిబ్బందితో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అన్నారు.
ఈటిబిపిఎస్ ఓట్ల లెక్కింపు కోసం 10 స్కానింగ్ టేబుల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమించామని అన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు భారత ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియా సెంటర్ ను చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి కౌంటింగ్ కు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట సహాయ రిటర్నింగ్ అధికారులు బి గంగయ్య, వి. హనుమా నాయక్, తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
=========================