Ex. minister Jogu: గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

సిరా న్యూస్, ఆదిలాబాద్:

గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

– మాజీ మంత్రి జోగు రామన్న

ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని అన్నారు. రైతు బంధు నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా రైతులను మోసం చేస్తుందని అన్నారు. గత రెండున్నర నెలలుగా రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1.60 లక్షల మంది రైతులు ఉండగా రూ. 286 కోట్ల నిధులు రైతుబంధుకు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటివరకు కేవలం 74 వేల మంది రైతుల ఖాతాలో రూ. 97 కోట్ల నిధులు మాత్రమే జమ చేశారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 70-80 శాతం సోయా రైతులు తమ పంటలు అమ్ముకున్న తర్వాత ఇప్పుడు సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికే చాలామంది రైతులు క్వింటాల్ కు రూ. 4200 చొప్పున సోయలు అమ్ముకున్నారని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో శనగ పంట కోతకు వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శనగ కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేవలం రెండు గ్యారెంటీలు అమలుచేసి మిగిలిన గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని ఆయన దుయ్యబట్టారు. అటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సైతం రైతుల ఉసురు తీసుకుంటుందని విమర్శించారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరపడం అమానుషమని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో విజ్జగిరి నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ కుమ్ర రాజు, కౌన్సిలర్ వేణుగంటి ప్రకాష్, నాయకులు ఆనంద్, నవతే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *